కట్టుకున్న భార్య వుండగానే ఆమెను మోసం చేస్తూప మరో యువతితో సహజీవనం చేస్తున్నాడు భర్త. అలాగని ఆ యువతికి న్యాయం చేశాడా అంటే అదీ లేదు. ఆమెకు కూడా తనకు పెళ్ళి కాలేదని నిన్నే పెళ్లాడతానని నమ్మించి మోసం చేశాడు. ఇలా ఇద్దరి జీవితాలలో ఆడుకున్న అతడు చివరకు ప్రియురాలి ఆత్మహత్యకు కారణమై చివరకు తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు  వదిలాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

అనంతపురం జిల్లాకు చెందిన నాదండ నాయుడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు భార్యా, కూతురితో కలిసి మల్కాజిగిరిలో నివాసముండేవాడు. అయితే అతడు కంపనీ పనిలో భాగంగా కొద్ది రోజులు కుటుంబానికి దూరంగా ఉప్పల్ ఇందిరానగర్ లో నివాసముండాల్సి వచ్చింది. ఈ సమయంలో అతడు అద్దెకుంటున్న ఇంటి యజమాని కూతురైన అనిత అనే యువతితో సన్నిహిత సంంబంధాన్ని ఏర్పర్చుకున్నాడు.  తనకు పెళ్లి కాలేదని యువతిని నమ్మించి ప్రేమలోకి దించాడు. 

ఈ క్రమంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చాడు. ప్రశాంత్ నగర్ లో ఓ గదిని అద్దెకు తీసుకుని అందులో వీరిద్దరు సహజీవనం చేస్తున్నాడు. ఇలా భార్యకు తెలియకుండా ప్రియురాలిని, ప్రియురాలికి తెలియకుండా భార్యనే మేనేజ్ చేస్తూ ఇద్దరితో  సంసారం చేస్తున్నాడు. 

అయితే అతడికి పెళ్లయిన విషయం ప్రియురాలు అనితకు ఈ మధ్యే తెలిసింది. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన ఆమె నాయుడికి నిలదీసింది. దీంతో వారిద్దరి మధ్య  గొడవలు జరుగుతున్నాయి. ఇలా గురువారం రాత్రి కూడా గొడవ జరగడంతో మనస్తాపానికిలోనైన అనిత బెడ్‌రూంలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్యాన్ కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో అందోళనకు గురైన నాయుడు కూడా హాల్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  

ఈ ఆత్మహత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. మృతుల వివరాలను సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసుు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.