ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు. 

పాతబస్తీలో మరో ప్రేమపెళ్లి కథ విషాదాంతమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను తననుంచి దూరం చేశారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత‍్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని పాతబస్తీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు మూడు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు అతన్ని బెదిరించి బలవంతంగా భార్యను తీసుకెళ్లిపోవటంతో మనస్తాపానికి గురయ్యాడు.

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమవటంతో శ్రీకాంత్‌ భరించలేకపోయాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంటల్లో కాలి తీవ్రంగా గాయపడిన అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ మృతి చెందాడు. 

పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమ్మాయి తండ్రి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో ఉండటంతో శ్రీకాంత్‌ కుటుంబసభ్యులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నాడని, దళితుడు కావటంతోనే అతడు కక్ష్యగట్టాడని శ్రీకాంత్‌ బందువులు ఆరోపిస్తున్నారు.