మమబూబ్ నగర్: గత మూడేళ్లుగా వారిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మనసులే కాదు అభిప్రాయాలు కలిసినా కులాలు మాత్రం కలవలేదు. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఎలాగూ పెద్దలను ఒప్పించి కలిసి జీవించలేమని భావించిన ప్రేమజంట కలిసి చనిపోదామనుకున్న దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషాదం మమబూబ్ నగర్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండలం వేముల గ్రామానికి చెందిన ఓ 19ఏళ్ల యువకుడు 15ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. మూడేళ్లుగా వారు ప్రేమించుకుంటుండగా ఇటీవలే ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. అయితే వీరిద్దరి  కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి ప్రేమను నిరాకరించారు. 

దీంతో తీవ్ర మనస్థాపానికి లోనయిన ఈ ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకుంది. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.