Asianet News TeluguAsianet News Telugu

జనగామలో.. సెల్ఫీ వీడియో తీసుకుని ప్రేమజంట ఆత్మహత్య..

జనగామ జిల్లాలో ఓ ప్రేమజంట తమ పెళ్లికి ఎవ్వరూ అంగీకరించరనుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి ముందు వీరు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇదిప్పుడు కలకలం రేపుతోంది. 

love couple committed suicide by taking a selfie video in Jangaon
Author
Hyderabad, First Published Aug 13, 2022, 2:03 PM IST

తెలంగాణ : రాష్ట్రంలోని జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సెల్ఫీవీడియో తీసుకుని తన మరణానికి గల కారణాన్ని వివరించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పాలకుర్తి మండలం బిక్యా నాయక్ తండాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన.. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిక్యానాయక్ తండాకు చెందిన గగులోతు రాజు (20), బానోతు దీపిన (16) ఇద్దరూ ప్రేమించుకున్నారు.

ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అయితే, తమ పెళ్లికి ఎవరూ అంగీకరించరని వారిలో వారే మదన పడిపోయారు. ఈ క్రమంలో  తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్షణికావేశంలో ఇద్దరూ కలిసి సెల్ఫీ వీడియో తీసుకుని తాము చనిపోతున్నట్లు గా ప్రకటించారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగారు. దీంతో యువతీయువకులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఆ మహిళ నుంచి నా కొడుకుని కాపాడండి... హెచ్ఆర్సీలో ఓ తండ్రి ఆవేదన.. పోలీసులు ఏన్నారంటే..

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 6న అనంతపురంలో ఇలాంటి విషాదం చోటుచేసుకుంది. బెళుగుప్ప మండల పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్ లోకి దూకి ఓ మైనర్ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన  ఎజిత (16), బెలుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి చెందిన అజయ్ (19) మృతదేహాలను గత శుక్రవారం సాయంత్రం జీడిపల్లి రిజర్వాయర్ లో స్థానికుల్లో గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే చీకటి పడడంతో ఆ రాత్రి మృతదేహాలను వెలికి తీయడం సాధ్యం కాలేదు. మరుసటి ఉదయం మృతదేహాలను వెలికి తీశారు. మృతుల కుటుంబ సభ్యులనుంచి ఫిర్యాదు స్వీకరించి సమగ్ర దర్యాప్తు చేపట్టిన తరువాత.. వివరాలు వెల్లడిస్తామని బెళుగుప్ప ఎస్సై రుషేంద్రబాబు తెలిపారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో జూన్ 28న ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్లోని బస్తీలో మైనర్ ప్రేమజంట చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రామంలోని గౌసియాహ్వా పోఖ్రే సమీపంలో చెట్టుకు ఉరి వేసుకున్న పదహారేళ్ల బాలిక, 17 ఏళ్ల బాలుడి మృతదేహాలు కనిపించాయని పోలీసు అధికారి తెలిపారు. ఈ జంట మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టంకు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం చెలరేగింది. అంతకుముందు రోజు తన సోదరుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు అని మృతుని సోదరుడు తెలిపాడు. ఎంత సేపటికీ తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయడంతో అతను కట్ చేశాడన్నారు. 

అయితే సోదరుడు తన తో చాటింగ్ చేస్తూ చాలా దూరం వెళ్తున్నానని, ఇక తిరిగి రానని మెసేజ్ చేశాడు అని అన్నారు. కాగా, ఈ ఇద్దరు మైనర్లు ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. వారిద్దరూ ఏడాదిగా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం వీరిద్దరూ కలిసి ఒకే చోట కనిపించడంతో బాలిక కుటుంబ సభ్యులు ఆ బాలికను అమ్మమ్మ గ్రామమైన కర్మియాకు పంపించారు. ఆదివారం వీరిద్దరూ కలుసుకున్నారు. ఆ తరువాత వీరి మృతదేహాలు కనిపించాయి. 

మృతులు మైనర్ లేనని పోలీస్ అధికారి అంబికారామ్ తెలిపారు. అమ్మాయికి పదహారేళ్లు,  అబ్బాయికి పదిహేడేళ్ల అని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం తరలించారు. దీనికి సంబంధించిన రిపోర్టు అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మృతురాలి తల్లి ఇంతకుముందే మృతి చెందిందని.. తండ్రి ముంబైలో పని చేస్తున్నాడని ఇరుగుపొరుగు వారు తెలిపారు.  

Follow Us:
Download App:
  • android
  • ios