మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబ్నగర్ సెకండ్ టౌన్ సిఐ ప్రవీణ్ కుమార్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఈ మేరకు తెలియజేశారు.. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిభ జూనియర్ కాలేజీకి చెందిన బస్సు ఈ ఘటనలో ప్రమాదానికి గురయ్యింది.
ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు బస్సులో ఉన్నారు. బస్సు కాలేజీ విద్యార్థులతో వస్తున్న క్రమంలో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డుమీద మలుపు తిరుగుతుండగా… వెనకనుంచి వస్తున్న ఓ లారీ అదుపుతప్పి బస్సును ఢీ కొట్టింది. ఆ సమయంలో సత్యనారాయణ అనే వ్యక్తి టూ వీలర్ మీద రోడ్డు దాటుతున్నాడు. అదుపుతప్పి బస్సును ఢీ కొట్టిన లారీ అతని మీద కూడా దూసుకెళ్లింది.
దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ఢీకొట్టడంతో కాలేజీ బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. దీని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, అనపర్తి వీర వెంకట కనకదుర్గ అఖిల అనే మహిళ కాకినాడ జిల్లా అన్నవరం ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పని చేస్తుంది. తన తోటి ఉపాధ్యాయులతో కలిసి ‘సంకల్పం’ అనే పేరుతో స్వచ్చంద సేవలు చేస్తుండేవారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గత శనివారం 10వ తరగతి చివరి పరీక్షల విధులకు హాజరై అఖిల తన టూ వీలర్ మీద తిరిగి వస్తుంది. కత్తిపూడి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె వస్తున్న ద్విచక్ర వాహనాన్ని రాంగ్ రూట్లో వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది.
దీంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యింది. యాక్సిడెంట్ గమనించినవారు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్డెడ్ అని తెలిపారు. అయితే, అఖిల అంతకుముందే అవయవ దానానికి ఒప్పుకుని ఉండడంతో… ఇక ఆమె పరిస్థితి కోలుకోవడం కష్టమని అవయవదానానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఆమెను ఆపరేషన్ థియేటర్కు తీసుకు వెళ్తున్నారు. ఆ సమయంలో అఖిల కొద్దిగా చేయి కదిపింది. దీంతో అందరిలోనూ ఆశలు చిగురించి.. ఆమె రెండేళ్ల కొడుకును తల్లి దగ్గరికి తీసుకువచ్చి.. అమ్మ అంటూ పిలిపించారు.
దానికి అఖిల మరోసారి స్పందించి చేయి కదిపింది. అది చూసిన కుటుంబ సభ్యులు, వైద్యులు ఆమె కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వెంటనే అవయవ దానాన్ని నిలిపివేసి ఆమెకు చికిత్స అందించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత అఖిల 40 శాతం వరకు కోలుకుంది. ఇక పూర్తిగా కోలుకొని తిరిగి మామూలు అవుతుందనుకున్న సమయంలో.. బుధవారం పరిస్థితి విషమించింది. ఆమె మృతి చెందింది.
