ఓ లారీ డ్రైవర్.. మిర్చీ ట్రేడర్ కి టోకరా పెట్టాడు. సరుకు అమ్మిన డబ్బును మిర్చి ట్రేడర్ చేతికి అందకుండానే డ్రైవర్ కాజేశాడు. దాదాపు రూ.71లక్షలతో డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారులో ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఏడుకొండలు పీవీఎల్‌ చిల్లీస్‌ ట్రేడర్‌లో పనిచేస్తున్నాడు. మహారాష్ట్రలోని షోలాపూర్‌ మార్కెట్‌లో 26న 10 టన్నుల సరుకును అమ్మగా బకాయిలతో కలిపి రూ.71 లక్షలపైగా వ చ్చాయి. అనంతరం ఇదే మార్కెట్‌ నుంచి గుంటూరు జిల్లా దాచేపల్లి వస్తున్న లారీలో సోమవారం తిరుగు ప్రయాణమయ్యాడు. 

ఏడుకొండలు వద్ద భారీ నగదు ఉన్న ట్లు లారీ డ్రైవర్‌ అబ్దుల్‌ హసీబ్‌ పసిగట్టాడు. సొత్తు కాజేయాలనే ఆలోచనతో తన పేరు ఆసిఫ్ గా చెప్పుకొన్నాడు. పటాన్‌చెరు వద్ద ఔటర్‌ పైకి రాగానే ఇంజన్‌లో లోపం ఉందంటూ లారీని ఆపేశాడు. ఏడుకొండలును సైతం కిందికి దింపి స్టార్ట్‌ చేసేందుకు సహకరించాలని కోరాడు. వెలుతురు కోసమంటూ ఏడుకొండలు సెల్‌ఫోన్‌ తీసుకున్నా డు. హఠాత్తుగా లారీ ఎక్కి నగదుతో పరారయ్యాడు. బాధితుడు టోల్‌గేట్‌ వద్దకు వచ్చి పోలీసులకు సమాచారం అందించాడు.

 సీఐ నరేష్‌ గాలింపు చేపట్టారు. నాగులపల్లి శివారులోని దాబా వద్ద లారీని నిలిపాడు. వాచ్‌మన్‌కు రూ.500 ఇచ్చి అత్యవసర పని ఉందని, లారీని చూడాలని చెప్పి పరారయ్యాడు. కాగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.