హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సీఎం కేసీఆర్ పై ముప్పేట దాడికి దిగుతున్నాయి. ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ తన వైఖరి మార్చుకోవాలంటూ నానా హంగామా చేస్తున్నాయి.

 

ఈనెల 19న ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన తెలంగాణ బంద్ కు సంపూర్ణమద్దతు సైతం ప్రకటించాయి. అటు ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నేతలు సైతం తెలంగాణ బంద్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈనెల 19న ఎర్ర బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. 

అయితే నేనున్నానంటూ తెలంగాణ సీఎంకు లోక్ సత్తాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మద్దతు పలికారు. సమ్మె విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ తన పూర్తి సంఘీభావం ప్రకటించారు. 

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడం సరికాదన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అసంబద్ధమంటూ విమర్శించారు. ఆర్టీసీ విలీనం అనేది అర్థం లేని డిమాండ్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా సమ్మెలతో ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు జయప్రకాశ్ నారాయణ.