హైదరాబాద్: తూర్పు  ఆఫ్రికా నుంచి బయలుదేరిన మిడతల దండు మహారాష్ట్రలోని నాగపూర్ వద్ద ఆగింది. తెలంగాణకు 200 కిలోమీ టర్ల దూరంలో దండు ఉన్నట్లు సమాచారం. నాగపూర్, గోండియా జిల్లాల్లోని బత్తాయి తోటలపై మిడతల దండు దాడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

మిడతల దండు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధ్యయనానికి ముఖ్యమంత్రి కెసీఆర్ వేసిన ఐదుగురు సభ్యుల కమిటీ బుధవారం నివేదికను సమర్పించనుంది. కమిటీ తన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తుంది. అదే విధంగా ఉమ్మడి ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో, ఎస్పీలతో సిఎస్ బుధవారం బీఆర్కె భవన్ లో సమావేశమవుతున్నారు. 

డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, ఫైర్ సర్వీసెస్ డీజీ, వ్యవసాయ -సహకార శాఖ కార్యదర్శి కూడా హాజరవుతారు. మిడతల దండు యెమెన్ దేశం నుంచి బయలుదేరిందని, అది ముంబైని చేరుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. 

రాష్ట్రానికి మిడతల దండు ప్రమాదంపై కూడా కమిటీ అధ్యయనం చేసినట్లు సమాచారం. మహారాష్ట్రలో 200 కిలోమీటర్ల దూరంలో తిష్టపేసిన మిడతల దండు రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని కమిటీ ఓ అంచనాలకు వచ్చినట్లు తెలుస్తోంది. నైరుతి రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. దీంతో గాలి దక్షిణం నుంచి ఉత్తరానికి వీస్తోంది. మిడతలు సాధారణంగా గాలివాటానికి అనుగుణంగానే తమ ప్రయాణం సాగిస్తాయి. 

ఆ స్థితిలో మిడతల దండు తెలంగాణ వైపు రాదని, మధ్యప్రదేశ్ వైపు వెళ్లే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. తూర్పు ఆసియా నుంచి బయలుదేరిన మిడతల దండు యెమెన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా భారతదేశంలోని రాజస్థాన్ కు చేరుకుని ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేస్తుందని భావిస్తున్నారు.

నాగపూర్ వెళ్లిన తెలం్గాణ అధికారుల బృందంపై వాటిపై పూర్తిగా అధ్యయనం చేసింది. అవి కలిగించే ప్రమాద స్థాయిపై, పాటి ప్రత్యుత్పత్తి కాలం, దాడి చేసే సామర్థ్యం వంటి విషయాలను కమిటీ అధ్యయనం చేసింది. అంతేకాకుండా ఏ మందులకు లొంగుతాయనే విషయాన్ని కూడా పరిశీలించారు. 

గాలి దిశ మారి తెలంగాణపై మిడతల దండు చేసినా ఎదుర్కునేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రధానంగా ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దాడి చేసే ప్రమాదం ఉంది. ఈ ప్రాంతాల్లో అధికారులు ఇప్పటికే సర్వే చేశారు. ఇతర జిల్లాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు 15 వేల లీటర్ల మెలాథియన్, క్లోరోఫైరోపోస్, లాంబ్డా సహా లాత్రిన్ ను అందుబాటు ఉంచారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ సరిహద్దుల్లో పిచికారీ చేసేందుకు ఫైరింజన్లు, జెట్టింగ్ యంత్రాలతో సిబ్బంది సిద్దంగా ఉన్నారు.