హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఓ నిందితుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. దొంగతనం కేసులో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో అతడు దొంగిలించిన సొమ్ము రికవరీకి వెళ్లగా అక్కడ గుండె పోటు వచ్చి అతడు చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటనకు సంభందించిన వివరాలు ఇలా ఉన్నాయి. రామంతాపూర్ లో నివాసముండే ప్రేమ్ చంద్ ఎర్రగడ్డలో బజాజ్ ఆటో ఫైనాన్స్ కంపెనీలో పనిచేసేవాడు. ఫైనాన్స్ ఏజెంట్లు అమ్మిన వాహనాల, ఈఎంఐ రికవరీ డబ్బులను సంస్థ కార్యాలయానికి తీసుకువెళ్లడం ఇతడి పని. ఇలా వారం రోజుల క్రితం ఓ ఏజెంట్ ఇచ్చిన రూ.2 లక్షలను ఆపీస్ కు తీసుకెళ్లకుండా ప్రేమ్ చంద్ పరారయ్యాడు.

దీంతో సంస్థ ప్రతినిధుల ఇతడిపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇతడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు దొంగిలింంచిన సొత్తు కోసం విచారించగా... ఆ డబ్బులు భువనగిరిలో దాచిపెట్టినట్లు చెప్పాడు.  పోలీసులు అతడిని భువనగిరి తీసుకుని వెళ్లగా అక్కడ డబ్బు దొరకలేదు. అయితే అక్కడి నుంచి ప్రేమ్ చంద్ ను తీసుకొచ్చే క్రమంలో మార్గమద్యలో నిందితుడు గుండెపోటుతో మరణించాడు.  

పోలీసుల విచారణ సందర్భంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోనే ఇతడు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అందువల్లే పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగించినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారు ఆవేధన వ్యక్తం చేశారు.