హైదరాబాద్: స్టూడియో ఎన్ న్యూస్ చానెల్‌ను లాకౌట్ చేస్తున్నట్టు యాజమాన్యం శనివారం నాడు ప్రకటించింది.  కొంత కాలంగా  చానెల్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించడం లేదని చానెల్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని కోరుతూ  ఉద్యోగులు ఇవాళ మరోసారి ఆందోళనకు దిగారు. ఈ సమయంలో చానెల్‌ను లాకౌట్ చేస్తున్నట్టు ఆ సంస్థ సీఈఓ ప్రకటించినట్టుగా ఉద్యోగులు చెబుతున్నారు.

ఈ సంస్థలో సుమారు 220 మంది ఉద్యోులు పనిచేస్తున్నారు. న్యూస్ చానెల్‌తో పాటు, యోగి పేరుతో ఆధ్యాత్మిక చానెల్ ను కూడ  నిర్వహిస్తున్నారు. అయితే కొంత కాలంగా ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తున్నారనే విమర్శలను యాజమాన్యం మూటగట్టుకొంది.

అయితే ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో జాప్యం చోటు చేసుకోవడంతో గత మాసంలో ఉద్యోగులు చానెల్ కార్యాలయం ముందు  ధర్నా నిర్వహించారు. వర్కింగ్ జర్నలిస్టు సంఘాల నేతలు కూడ ఉద్యోగుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు.

అయితే  తమకు చెల్లించాల్సిన పెండింగ్ వేతనాలను చెల్లించాలని ఉద్యోగులు యాజమమాన్యాన్ని కోరుతున్నారు.  ఈ తరుణంలో  ఒక్క నెల వేతనాలను ఆ సమయంలో ఉద్యోగులకు చెల్లించినట్టు  ఉద్యోగులు చెబుతున్నారు. పెండింగ్ బకాయిలను గత నెలాఖరునాటికి చెల్లించనున్నట్టు ఆ సంస్థ యాజమన్యం ఆరోజున ఉద్యోగులకు హమీ ఇచ్చిందని సమాచారం.

అయితే గత నెలలో ఇచ్చిన హమీలను యాజమాన్యం అమలు చేయలేదు. పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల వేతన బకాయిలను చెల్లించలేదు. దీంతో శనివారం నాడు ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

అయితే తమకు వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే  సంస్థ యాజమాన్యం లాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఉద్యోగులకు ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ ప్రకటించారు.

అయితే పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలను చెల్లించడంతో పాటు మరో ఆరు మాసాల వేతనాలను పరిహారంగా ఇవ్వాలని ఉద్యోగులు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ వేతన బకాయిలను మాత్రమే చెల్లించనున్నట్టు యాజమాన్యం చెబుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే పరిహారం చెల్లింపు విషయమై వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ నేతలు, ఉద్యోగులు యాజమాన్యంతో చర్చిస్తున్నారు.