వైద్యశాఖ అభిప్రాయం మేరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి.
కరోనా మహమ్మారి రోజు రోజుకీ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో.. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కేవలం ఉదయం ఆరుగంటల నుంచి పది గంటల వరకు మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన సమయంలో పూర్తిగా లాక్ డౌన్ విధించారు. కాగా.. ఈ లాక్ డౌన్ ని మరో వారం రోజులపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించక తప్పదని వైద్యశాఖ భావిస్తోంది. ఇప్పటికే వాణిజ్య, ఎక్సైజ్ శాఖకు ప్రభుత్వం సంకేతాలిచ్చినట్లు తెలియవచ్చింది. లాక్ డౌన్ కరోనా నియంత్రణపై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. వైద్యశాఖ అభిప్రాయం మేరకు లాక్ డౌన్ పొడిగించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా జూన్ మొదటి వారం వరకు లాక్ డౌన్ పొడిగించాలని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి.
కరోనాను కట్టడి చేసేందుకు తెలంగాణలో ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో పాజిటీవ్ కేసులు ఆశించిన మేరకు తగ్గినట్లు కనిపించలేదు. అయితే లాక్ డౌన్‌తో కేసుల సంఖ్య కొంతవరకు తగ్గింది. ప్రస్తుతం తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది.
దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలియవచ్చింది. అయితే వ్యాక్సినేషన్లను దిగుమతి చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానించింది. జూన్ మొదటి వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పెద్ద మొత్తంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో లాక్ డౌన్‌ను మరికొన్ని రోజులపాటు పొడిగిస్తే మంచిదనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవచ్చింది.
