విజృంభిస్తున్న కరోనా వైరస్: హైదరాబాదులో మరోసారి లాక్ డౌన్?

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో హైదరాబాదులో మరోసారి లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు అర్థమవుతోంది. కేసీఆర్ సమీక్షలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.

Lockdown may be imposed in Hyderabad to control Coronavirus

హైదరాబాద్: హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధిలో కరోనా వైరస్ దండిగా విస్తరిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 15 రోజుల పాటు హైదరాబాదులో లాక్ డౌన్ విధించాలని ఆరోగ్య శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి 3,4 రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. 

పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైనంత మాత్రాన భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, అందరికీ వైద్యం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని కేసీఆర్ చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి, వైరస్ రోగులకు అందిస్తు్నన చికిత్స, భవిష్యత్తు వ్యూహంపై చర్చించడానికి కేసీఆర్ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

పరిస్థితిని మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరించారు. జిహెచ్ఎంసీ పరిధిలో మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని వైద్యాధికారులు, నిపుణులు కోరుతున్నట్లు ఆయన తెలిపారు. దానిపై కేసీఆర్ స్పందించారు. హైదరాబాదు కోటీ మంది నివసిస్తున్న పెద్ద నగరమని,  దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఉన్న పరిస్థితే హైదరాబాదులో ఉందని, అది సహజమని ఆయన అన్నారు. 

లాక్ డౌన్ తొలగించిన తర్వాత ప్రజల కదలికలు పెరిగాయని, దాంతో వైరస్ వ్యాపిస్తోంది, చెన్నైలో మళ్లీ లాక్ డౌన్ విధించారని, ఇతర నగరాల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయని ఆయన చెప్పారు. 

జిహెచ్ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలంటే పలు విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అన్ని విషయాలను పరిశీలించి లాక్ డౌన్ విధించే విషయంలో ప్రభుత్వం అవసరమైన నిర్ణయం తీసుకుంటుందని కేసీఆర్ చెప్పారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios