వరద నీటిలోనే మీర్‌పేటవాసుల నిరసన: సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం
భారీ వర్షంతో హైద్రాబాద్ మీర్‌పేటలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో భారీ వరద కాలువను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

హైదరాబాద్: భారీ వర్షంతో హైద్రాబాద్ మీర్‌పేటలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. వరద నీరు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో భారీ వరద కాలువను చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నెల 13వ తేదీ రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో మీర్‌పేట పరిధిలోని పలు కాలనీల్లోకి నీరు చేరింది. అంతకుముందు కురిసిన వర్షాలతో కొన్ని కాలనీలు చాలా రోజుల వరకు నీటిలోనే ఉన్నాయి.
also read:హైద్రాబాద్‌కు వరదలు: మూసీపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఈ నెల 17వ తేదీ రాత్రి కురిసిన వర్షంతో మరోసారి కాలనీలన్నీ నీటిలోనే ఉన్నాయి. వరద నీరు వెళ్లిపోయేలా భారీ వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టాలని స్థానికులు వరద నీటిలోనే ప్లకార్డులు పట్టుకొని నిరసనకు దిగారు.
ఇదే సమయంలో మీర్‌పేటకు చెందిన కాలనీ వాసులను పరామర్శించేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ కు అడ్డంగా బైక్ లు అడ్డుపెట్టి స్థానికులు నిరసనగా దిగారు.
రోజుల తరబడి వరద నీటిలోనే ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆవేదన చెందారు. కనీసం తాగేందుకు కూడ మంచినీళ్లు కూడ దొరకని పరిస్థిత నెలకొందని స్థానికులు చెప్పారు.
స్థానికుల నిరసనతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిలు కారు దిగి నిరసనకారుల వద్దకు వెళ్లి సముదాయించారు. వరద సమస్య పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకొంటామని హామీ ఇచ్చారు.