హైదరాబాద్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ నెల 13వ తేదీన రాత్రి సుమారు 32 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఈ నెల 17వ తేదీన జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం 10 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో నగరం మరోసారి నీటిలో మునిగింది.

also read:ఇంటి చుట్టూ వరద నీరు, ఇంట్లో వృద్దులు: కాపాడిన పోలీసులు

 నగరంలోని పలు ప్రాంతాల్లోని కాలనీలు మరోసారి నీటిలోనే ఉన్నాయి.భారీ వర్షంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నగరంలోని మూసారాంబాగ్  బ్రిడ్జి పై నుండి మూసీ ప్రవహిస్తోంది.

మూసీ నదికి ఇరువైపులా  రెయిలింగ్ ఏర్పాటు  చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  మూసీ నది వరద పరిస్థితిని డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ ఫోటోల ద్వారా ఎక్కడ మూసీని రెయిలింగ్ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయిస్తామని మూసీ రివర్ బోర్డు ఛైర్మెన్ సుధీర్ రెడ్డి తెలిపారు.

వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందున మూసీ ఎక్కువ ప్రవహిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.  మూసీ ప్రవాహంతో భవిష్యత్తులో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను  రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు.

మూసీపై నిర్మించిన బ్రిడ్జిల నాణ్యతను కూడ పరిశీలించనున్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత వాటిని పరిశీలించిన తర్వాతే వాహనాల రాకపోకలకు అనుమతిస్తారు.

చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ బ్రిడ్జిలపై నుండి మూసీ ప్రమాదకరస్థితిలో ప్రవహించిన విషయం తెలిసిందే. మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుండి  నాలుగు రోజుల వ్యవధిలో రెండు సార్లు బ్రిడ్జిపై నుండి వరద నీరు పారింది. దీంతో బ్రిడ్జిల నాణ్యతను పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.