హైదరాబాద్ లో దారుణం.. మిల్క్ షేక్ లో బల్లి.. బాలుడి అస్వస్థత..

హైదరాబాద్ లో ఓ బాలుడు తాగిన మిల్క్ షేక్ లో బల్లి ఉండడంతో.. ఆ చిన్నారి అస్వస్థత పాలయ్యాడు. వైద్యులు అతడితో వాంతులు చేయించగా అందులో బల్లి బయటపడింది. 

Lizard in milkshak nine years old get sick in hyderabad

హైదరాబాద్ : హైదరాబాదులోని పీర్జాదిగూడలో రిలయన్స్ స్మార్ట్ లో మిల్క్ షేక్ కొనుగోలు చేసి తాగిన బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. బాలుడిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి కడుపు శుభ్రం చేశారు. ఈ క్రమంలో బాలుడు వాంతులు చేసుకున్నాడు. అందులో బల్లి కనిపించింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పీర్జాదిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలోని రిలయన్స్ స్మార్ట్ లో స్థానికంగా నివసిస్తున్న సహస్ర్ (9) డిలైట్  మిల్క్ షేక్ కొనుగోలు చేశాడు. దానిని తాగిన తర్వాత అనారోగ్యానికి గురయ్యాడు. తల్లిదండ్రులు అతడిని సమీపంలోని  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి  తీసుకువెళ్లారు.

వైద్యులు  సహస్ర్ కు వాంతులు చేయించగా అందులో బల్లి బయటపడింది. బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం తల్లిదండ్రులు, బంధువులు రిలయన్స్ స్మార్ట్ ఎదురుగా ఆందోళన చేపట్టారు. చికిత్సకు అయిన ఖర్చు చెల్లించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు రిలయన్స్ స్మార్ట్ మేనేజర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

ఇలా ఉండగా,  మూడు రోజుల క్రితం హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న బావర్చి హోటల్ బిర్యానిలో బల్లి కనిపించింది. రామ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ రవిచారికి ఈ చేదు అనుభవం ఎదురయింది. క్రాస్ రోడ్స్ లోని ఆ రెస్టారెంటు నుంచి తెప్పించుకున్న చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి తింటుండగా ఆ బిర్యానీలో చనిపోయిన బల్లి కనిపించిందని రవి తెలిపారు. సగం బిర్యానీ తిన్న తర్వాత బల్లి ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. వెంటనే ఆ దృశ్యాలను తన సెల్ ఫోన్ లో వీడియో తీసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  కార్పొరేటర్ రవి చారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బిర్యానీ శాంపిళ్లను సేకరించి టెస్టింగ్ కోసం ఫుడ్ కంట్రోల్ ల్యాబ్ కి  పంపించారు. ఘటనపై సమాచారం అందుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ బావర్చి బిర్యానీ సెంటర్కు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. 

ఇదిలా ఉండగా రాజస్థాన్లోనూ ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బల్లి పడిన మజ్జిగ తాగి నూతన వధువుతో సహా 16 మంది అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. మజ్జిగ తయారు చేసే పాత్రలో బల్లి పడింది. ఆ విషయాన్ని గమనించకుండా నూతన వధూవరులతో సహా పిల్లలు, కుటుంబ సభ్యులు మజ్జిగ తాగారు. దీంతో అందరి ఆరోగ్యం క్షీణించింది. వెంటనే బాధితులను  ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన భరత్ పూర్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే రాజస్థాన్ రాష్ట్రం భరత్పూర్ జిల్లా లోని సిక్రీలోని ఓ గ్రామానికి చెందిన మహ్మద్ కుమారుడు నిజాముద్దీన్ వివాహం జరిగింది. వివాహం అనంతరం జరిగిన ఓ కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు.  ఇంట్లో తయారు చేసిన మజ్జిగ వారందరికీ అందించారు. ఈ క్రమంలో బల్లి పడిన మజ్జిగ తాగి 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. అందులో వధూవరులు కూడా ఉన్నారు. వీరందరిని హుటా హుటిన సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడం వల్ల వారిని ఆల్వార్ ఆస్పత్రిలో చేర్చారు. చివరగా కుటుంబ సభ్యులు మజ్జిగ కుండను ఖాళీ చేయగా అందులో బల్లి ముక్కలై కనిపించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios