Asianet News TeluguAsianet News Telugu

రెండు నెలల్లో రూ. 5 వేల కోట్లు: లిక్కర్ సేల్స్‌తో తెలంగాణ ఖజనాకు డబ్బు

 తెలంగాణ రాష్ట్రంలో  మే, జూన్ మాసాల్లో రూ. 5 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. కరోనా కష్టకాలంలో  మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది.

Liquor worth RS 5 thousand crore sold in two months in telangana
Author
Hyderabad, First Published Jul 7, 2020, 12:47 PM IST


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో  మే, జూన్ మాసాల్లో రూ. 5 వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. కరోనా కష్టకాలంలో  మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయం తగ్గినా మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఆదాయం వచ్చి చేరుతోంది.

ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. మార్చి, ఏప్రిల్ మాసాల్లో మద్యం దొరకక మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రతి రోజూ మద్యానికి బానిసలుగా  మారిన వారు ఆసుపత్రుల్లో చేరిన కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఆ తర్వాతి రోజుల్లో ఈ కేసులు క్రమంగా తగ్గిపోయాయి.

తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరవడంతో రాష్ట్రంలో కూడ మద్యం దుకాణాలు తెరవాల్సి వచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మే 6వ తేదీ నుండి రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరిచారు. తొలుత ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం దుకాణాలు తెరిచేవారు.

also read:మందుబాబులకు గుడ్‌న్యూస్: నేటి నుండి రాత్రి తొమ్మిదిన్నర వరకు వైన్స్ షాపులు

ఈ ఏడాది జూలై 2వ తేదీ నుండి మద్యం దుకాణాలను రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు తెరిచి ఉంచనున్నట్టుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. దీంతో మందు బాబులకు ఇబ్బందులు లేకుండాపోయాయి.

ఈ ఏడాది మే, జూన్ మాసాల్లో ప్రతి రోజూ సగటున రూ.68 కోట్ల మేర మద్యం విక్రయాలు సాగినట్టుగా ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మే మాసంలో రాష్ట్రంలో రూ. 1,864 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జూన్ మాసంలో 1,955 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టుగా ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

జూన్ మాసంలో ఆశించిన మేరకు మద్యం విక్రయాలు జరగలేదని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయంతో ఉన్నారు. జూన్  28 వ తేదీన జీహెచ్ఎంసీలో మరోసారి లాక్ డౌన్ విధించే యోచన చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి.

వారం రోజుల వ్యవధిలోనే సుమారు రూ. 750 కోట్ల మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నాయి. లాక్ డౌన్ విధిస్తే మద్యం దొరకదనే ఉద్దేశ్యంతో మద్యం ప్రియులు ముందుగానే మద్యం కొనుగోలు చేశారు. 

దీంతో సగటున రోజూ కనీసం రూ. 100 కోట్ల మేర మద్యం విక్రయాలు చోటు చేసుకొన్నట్టుగా ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఈ రెండు మాసాల్లో 13.45 లక్షల కేసుల బీర్లు, 13.45 లక్షల కేసుల లిక్కర్ విక్రయాలు చోటు చేసుకొన్నట్టుగా ప్రభుత్వం చెబుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios