మనమంతా నూతన సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు దేశంలో అంబారాన్ని అంటేలా నిర్వహించేవారు. అయితే.. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. ఈ ఏడాది అన్ని ప్రాంతాల్లో సంబరాలకు బ్రేకులు పడ్డాయి. అయితే.. కేవలం ఈవెంట్స్ మాత్రమే ఆగిపోయాయని.. ఎంజాయ్ మెంట్ కి మాత్రం ఎక్కడా డోకా లేకుండా జరిగాయని తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం అమ్మకాలు.. తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగాయి. రాష్ట్రంలో మద్యం ఏరులై పారింది. మందుబాబులు పీకలదాకా తాగి.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

తెలంగాణ రాష్ట్రంలో కేవలం గత నాలుగురోజుల్లో రూ.758.76 కోట్ల విలువైన లిక్కర్‌ వ్యాపారం జరిగింది. డిసెంబర్‌ 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల వ్యవధిలోనే పెద్ద ఎత్తున మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ పేర్కొంది. అయితే ఈ ఏడాది రాష్ట్రంలో నూతన సంవత్సరం వేడుకలకు అనుమతి లేకున్నా.. గతేడాది పోలిస్తే ఈ నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు అధికంగా ఆదాయం రావడం విశేషం. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.300 కోట్ల విక్రయాలు జరిగాయి. మొత్తంగా 8.61 కోట్ల లిక్కర్ కేసులు, 6.62 కోట్ల బీర్ కేసుల అమ్మకాలు జరిగినట్లు అబ్కారీ శాఖ తెలిపింది