మంత్రి మహేందర్‌రెడ్డికి చేదు అనుభవం: కాన్వాయ్‌పై రాళ్ళ దాడి, సురక్షితం

Lingampally villagers protest against minister Mahender reddy
Highlights

మంత్రి మహేందర్ రెడ్డి కాన్వాయ్ పై రాళ్ళ దాడికి పాల్పడిన  లింగంపల్లి గ్రామస్థులు


రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో  తెలంగాణ రాష్ట్ర  రవాణ శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డికి సోమవారం నాడు చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై లింగంపల్లి గ్రామస్థులు రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఆందోళనకారులను  పోలీసులు చెదరగొట్టారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి గ్రామంలో సోమవారం నాడు  ఆటోను కారు ఢీకొట్టింది.ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు మహిళలు కాగా, మరోకరు పురుషుడు.

ఈ ప్రమాద ఘటనను నిరసిస్తూ బాధిత కుటుంబాలకు  ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెల్లించాలని డిమాండ్ చేశారు. అయితే బాధిత కుటుంబాలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అయితే ఆందోళన విషయం తెలుసుకొన్న తెలంగాణ రాష్ట్ర  రవాణ శాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొన్నారు.

బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షల చొప్పున పరిహరం చెల్లించనున్నట్టు మంత్రి పి. మహేందర్ రెడ్డి  ప్రకటించారు. అయితే పరిహారాన్ని  రూ. 25 లక్షలకు పెంచాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. కానీ, మంత్రి మాత్రం పరిహారం విషయమై సీఎంతో చర్చించి చెబుతామన్నారు. అయితే దీంతో  ఘటన స్థలంలో ఆందోళన చేస్తున్న ఆందోళనకారులు మంత్రిపై కోపంతో ఊగిపోయారు. పరిహారాన్ని పెంచాలని డిమాండ్ చేశారు.

మంత్రితో  ఆందోళనకారులు  వాగ్వావాదానికి దిగారు. పరిస్థితి చేయిదాటిపోతుండడంతో పోలీసులు మంత్రి పి. మహేందర్‌రెడ్డిని కారులో అక్కడినుండి పంపించేందుకు ప్రయత్నించారు. మంత్రి కాన్వాయ్‌కు ఆందోళనకారులు అడ్డుకొన్నారు. పరిహారం చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మంత్రి పి. మహేందర్ రెడ్డి కాన్వాయ్‌పై రాళ్ళ వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను  చెదరగొట్టారు. రాళ్ళ దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. పోలీసుల దాడిలో ఇద్దరు గ్రామస్థులకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆందోళనకు నాయకత్వం వహించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మంత్రి మహేందర్ రెడ్డిని సురక్షితంగా సంఘటనస్థలం నుండి పంపించేశారు.

ప్రమాదానికి కారణమైన కారులో మద్యం బాటిళ్ళు లభ్యమయ్యాయి. కారులో ఉన్న యువకుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం వాటిల్లిందని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

loader