హైదరాబాద్ వనస్థలిపురంలో బీటెక్ విద్యార్థిని దివ్య హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు శేఖర్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా విధించింది.

హైదరాబాద్ వనస్థలిపురంలో బీటెక్ విద్యార్థిని దివ్య హత్య కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు శేఖర్‌కు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 50 వేల జరిమానా విధించింది. 2010లో శేఖర్ దివ్యను అతికిరాతకంగా బీరు బాటిళ్లు, హాకీ స్టిక్స్‌తో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 12 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. ఈ కేసులో 40 మంది సాక్ష్యులను విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు.. తాజాగా శేఖర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. 

ఈ కేసు వివరాలు.. 2010 సెప్టెంబర్‌లో నల్గొండ జిల్లాకు చెందిన శేఖర్ తన జూనియర్ దివ్యను హత్య చేశాడు. దివ్య తల్లిదండ్రులు కోల్‌కతాలో ఉండడంతో హబ్సిగూడలోని బంధువుల వద్ద ఉండేది. మరోవైపు శేఖర్ తల్లిదండ్రులు కూడా ముంబైలో ఉండేవారు. అయితే శేఖర్, దివ్యలు కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే దివ్య, శేఖర్‌ల విభేదాలు తలెత్తాయి. దివ్య మరొకరితో క్లోజ్‌గా ఉంటుందని శేఖర్ అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 19వ తేదీన శేఖర్.. తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించేందుకు దివ్యను వనస్థలిపురంలోని తన ఫ్లాట్‌కు పిలిపించుకున్నాడు. 

అక్కడే శేఖర్ బేస్‌బాల్ బ్యాట్‌తో దివ్య తల పగులగొట్టి హత్య చేశాడు. అనంతరం తన స్నేహితుడితో పాటు దివ్య ఫ్రెండ్ ప్రదీప్‌కు ఎస్ఎంఎస్ పంపిచాడు. దివ్యను హత్య చేశానని, తాను ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నానని అందులో పేర్కొన్నాడు. దీంతో అప్రమత్తమైన ప్రదీప్ పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా దివ్య మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంటం గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఆ తర్వాత కొద్ది రోజులకు శేఖర్‌ను నాంపల్లి రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే దివ్యను హత్య చేసిన తర్వాత తాను ముంబై పారిపోయినట్టుగా శేఖర్ పోలీసులకు చెప్పాడు. అయితే పోలీసులు ఇక్కడున్న శేఖర్ బంధువులపై ఒత్తిడి తీసుకురావడంతో అతడు తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు. ‘‘నేను క్షణికావేశంలో దివ్యను చంపేశాను. దివ్య తన స్కూల్‌మేట్ ప్రదీప్‌తో సన్నిహితంగా ఉంటూ నన్ను మోసం చేసింది. నేను పంపిన ప్రేమలేఖలతో ఆమె నన్ను బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించింది’’ అని శేఖర్ ఆ సమయంలో చెప్పాడు.