జగిత్యాల: ఓ యువతి హత్య కేసులో ఆమె తండ్రికి జగిత్యాల జిల్లా కోర్టు జీవీత ఖైదు విధించింది. అతనితో పాటు మరో ఇద్దరికి కూడా కోర్టు జీవిత ఖైదు విధించింది. కూతురు పెళ్లి ఖర్చులు తప్పించుకునేందుకు తండ్రి పథకం ప్రకారం హత్యకు పాల్పడినట్లు రుజువైంది. 

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన పాట్కూరి సత్యనారాయణ రెడ్డ్ికి పెగడపల్లి మండలం ముద్దులపల్లికి చెందిన ప్రేమలతతో 28 ఏళ్ల కింద పెళ్లయింది. వారికి మౌనశ్రీ అనే కూతురు ఉంది. అయితే, దంపతుల మధ్య గొడవలు వారి విడాకులకు దారి దారి తిశాయి. 

అయితే, మొదటి భార్యతో విడాకులు తీసుకున్నప్పుడు కూతురు మౌనశ్రీ పెళ్లి సత్యనారాయణ రెడ్డి చేయాలి ఒప్పందం కుదిరింది. మౌనశ్రీ తన తల్లి ప్రేమలతతో కలిసి కరీంనగర్ లో ఉంటూ తరుచుగా తండ్రి వద్ద ఉంటూ వచ్చేది.

సత్యనారాయణరెడ్డి స్వగ్రామంలోని భూమిని విక్రయించాడు. అందులో రూ. 16 లక్షలు కూతురు వివాహానికి కేటాయించాలని ప్రేమలత బంధువులు కోరారు. 2015 సెప్టెంబర్ 8వ తేదీన తన వద్దకు రావాలని సత్యనారాయణ రెడ్డి కోరడంతో మౌనశ్రీ పెనుగుమట్లకు వెళ్లింది. 

సెప్టెంబర్ 9వ తేదీ తెల్లవారు జామున 22 ఏళ్ల మౌనశ్రీ హత్యకు గురైంది. తన కూతురిని పథకం ప్రకారం సత్యనారాయణ రెడ్డి, అతని భార్య లత, బావ మరిది కల్లెం రాజు ఉరేసి చంపారని ప్రేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఆ కేసును పోలీసులు విచారించారు. కూతురు పెళ్లి ఖర్చులను తప్పించుకునేందుకు పథకం ప్రకారం సత్యనారాయణ రెడ్డి, మిగతా ఇద్దరితో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు రుజువైంది. దీంతో ముగ్గురికి కోర్టు జీవిత ఖైదు విధించింది.