ఈటల రాజేందర్ లేఖంటూ వైరల్: వీణవంక పోలీసులకు బిజెపి ఫిర్యాదు
క్షమాపణలు కోరుతూ, తన తప్పిదాలను అంగీకరిస్తూ ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ కు రాసినట్లు చెబుతున్న లేఖపై బిజెపి నేతలు వీవణవంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లేఖ ఫేక్ అని వారు చెప్పారు.
హైదరాబాద్: తమ పార్టీ నేత ఈటల రాజేందర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కాక ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కు క్షమాపణలు కోరుతూ రాశారంటూ చెబుతున్న లేఖపై బిజెపి నేతలు వీణవంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ లేఖ నకిలీదని, నిజమైంది కాదని వారు ఫిర్యాదులో చెప్పారు. ఫేక్ లెటర్ తయారు చేసి సోషల్ మీడియా లో సర్కులేట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
ఇదిలావుంటే, మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కాక ముందు ప్రస్తుత బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును క్షమాపణలు కోరుతూ రాశారంటూ చెబుతున్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చేసింది తప్పేనని, సమావేశాలు జరిగింది నిజమేనని, తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన నాయకులు కూడా హాజరు కావడం వాస్తవమేనని అంగీకరిస్తూ ఈటల రాజేందర్ కేసీఆర్ కు ఆ లేఖను రాసినట్లు చెబుతున్నారు.
కేసీఆర్ కు వ్యక్తిగతంగా ఈటల రాజేందర్ రాశారంటూ చెబుతున్న ఆ లేఖ బయటకు ఎలా వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాను చేసిన తప్పులను సరిదిద్దుకుంటానని ఆయన కేసీఆర్ కు ఆ లేఖ ద్వారా చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తాను ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించానని ఈటల రాజేందర్ చెప్పారు. దానికీ, ఈ లేఖకు లింక్ పెడుతూ కూడా ప్రచారాలు సాగుతున్నాయి.
ఆ లేఖ మీద తేదీ లేదు. ఒకవేళ ఈటల రాజేందర్ రాసి ఉంటే ఎప్పుడు రాశారనేది తెలియదు. ఇది నిజంగానే ఈటల రాజేందర్ రాసిన లేఖనేనా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ అది నిజమైతే దాన్ని లీక్ చేసింది ఎవరు, ఎందుకు లీక్ చేశారనేది కూడా తేలాల్సి ఉంది. ఓ నకిలీ లేఖను ఎవరైనా సృష్టించి ప్రచారం చేస్తున్నారా అనేది తేలాల్సి ఉంది.
ఆ లేఖపై ఈటల రాజేందర్ మీడియా ప్రతినిధి ఏషియానెట్ ప్రతినిధికి వివరణ ఇచ్చారు. అది నిజమైంది కాదని, ఫేక్ అని ఆయన చెప్పారు. దానిపై ఫిర్యాదు చేస్తున్నట్లు కూడా చెప్పారు.