ప్రపంచ దేశాలను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది అవస్థలు పడుతున్నారు. ప్రతి రోజూ మన దేశంలోనే వందల, వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనూ వైరస్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఇప్పటికే 30వేల కేసులు దాటిపోయాయి. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకోవడం గమనార్హం.

అయితే.. గత వారం రోజులుగా.. గ్రేటర్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తుండటం విశేషం. ఈ నెల రెండో తేదీ తర్వాత వారం రోజుల పాటు గజగజలాడించిన కరోనా కాస్త శాంతించినట్టు ఉంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లో 918 మందికి వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 

ఈ నెలలో గురువారం నాటికి గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసుల సంఖ్య 11,735కు చేరింది. ఈ నెల ఒకటి, రెండో తేదీలు మినహా బుధవారం వరకు 1200 నుంచి 1600కు మించి కేసులు నమోదయ్యాయి. 

పెరుగుతున్న కేసుల సంఖ్యతో చాలా మంది బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. కొన్ని వ్యాపార సముదాయాలు స్వచ్ఛంద లాక్ డౌన్ ను చేపట్టాయి.. వారం, పది రోజులుగా దుకాణాలను తెరవలేదు. కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో కొద్ది రోజుల పాటు అమ్మకాలను నిలిపివేశారు. ఇలా ఎవరికి వారు నియంత్రణలు పాటించారు.