పొత్తులపై కామ్రేడ్లు స్పష్టత ఇచ్చారు. కుదిరితే బీఆర్ఎస్‌తో పొత్తు కొనసాగుతుందని అన్నారు. లేదంటే.. సీపీఎం, సీపీఐలు కలిసే వాటికి బలం ఉన్న స్థానాల్లో పోటీకి దిగుతాయని వివరించారు.
హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో వామపక్షాలు అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలవటానికి కామ్రేడ్ల మద్దతు కీలకమైంది. అప్పుడే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వామపక్షాలతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందనే చర్చ జరిగింది. దీనిపైనే ఇప్పుడు మరోసారి చర్చ పెరిగింది. బీఆర్ఎస్‌తో కామ్రేడ్లకు చెడిందని, అందుకే ఆ లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్‌తో జతకడుతున్నారనే వదంతులు వ్యాప్తిలోకి వచ్చాయి. తాజాగా, వీటన్నింటికీ సీపీఎం, సీపీఐ పార్టీలు స్పష్టత ఇచ్చారు.
సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతలు తమ్మినేని వీరభద్రం అధ్యక్షతన సమావేశమయ్యారు. ఈ భేటీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డి, సీపీఎం నేతలు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు హాజరయ్యారు.
రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై వీరు ఈ సమావేశంలో దీర్ఘంగా చర్చించారు. సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసే ఉంటాయని వీరు స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో పొత్తు కుదిరితే కలిసి పోటీ చేస్తాయని, కుదరకపోతే సీపీఎం, సీపీఐ పార్టీలు కలిసి వాటికి బలం ఉన్న చోట్ల పోటీ చేస్తాయని వివరించారు.
అంతేకానీ, కాంగ్రెస్‌తో జతకడుతుందనే వాదనలు అవాస్తవాలని, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. పొత్తు కుదిరితే వారి స్థానాలు గల్లంతవుతాయనే ఆందోళన నుంచి ఇలా బురదజల్లే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు. అంతేకానీ, పొత్తుల కోసం తాము వెంపర్లాడబోమని చెప్పారు. కేసీఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడే వెళ్లి దీనిపై చర్చిస్తామని పేర్కొన్నారు.
Also Read: Manipur: మణిపూర్‌లో హైడ్రామా.. సీఎం బిరెన్ సింగ్ రాజీనామా పత్రాన్ని చించేసిన మహిళలు (Video)
బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని మునుగోడులో బీజేపీ గెలవకుండా తాము అడ్డుకోగలిగామని లెఫ్ట్ లీడర్లు తెలిపారు. ఒక వేళ మునుగోడులో బీజేపీ అభ్యర్థి గెలిచి ఉంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలు ముమ్మరం చేసే దని వివరించారు.
