తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్ష పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌తో భేటీ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల గురించి, వారికి వచ్చే సీట్ల గురించి చర్చించనున్నారు. ఒకట్రెండు రోజుల్లో సీఎంతో వీరు భేటీ కావడానికి అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు సీఎంవో తెలిపింది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వామపక్షాలు అందుకు సిద్ధమవుతున్నాయి. దీర్ఘ ప్రణాళికలు వేసి తాము పోటీ చేసే ప్రాంతాల్లో ఈసారైనా గెలవాలని ఆలోచిస్తున్నాయి. అందుకే అధికార బీఆర్ఎస్ పార్టీతో సీట్ల పంపకాల గురించి చర్చ మొదలు పెట్టాలని, వీలైనంత త్వరగా సీట్లను ఖరారు చేసుకోవాలని అనుకుంటున్నాయి. అందుకే మూడు రోజుల క్రితం మగ్దూం భవన్‌లో సీపీఐ, సీపీఎం కార్యదర్శులు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సీట్ల పంపకాలపై వీలైనంత త్వరగా ఒక హామీ తీసుకుని అందుకు తగ్గ ప్రణాళికలు వేసుకోవాలని వారంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. 

అనంతరం వారు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ అపాయింట్‌మెంట్ కన్ఫామ్ చేస్తామని సీఎంవో వారికి సమాచారం ఇచ్చింది. అపాయింట్‌మెంట్ ఖరారయ్యాక వామపక్ష పార్టీల నేతలు సీఎం కేసీఆర్‌తో సీట్ల పంపకాల గురించి సమావేశమై చర్చించనున్నారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలువురు ముఖ్య నేతలు సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. ఈ పార్టీలకు కేటాయించే సీట్ల సంఖ్య.. కేటాయించే స్థానాలపై స్పష్టత తీసుకోనున్నారు. ఈ విషయంపై స్పష్టత వస్తే వీలైనంత తొందరగా అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలు, క్యాడర్‌ మేనేజ్‌మెంట్, ఓటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలల గడువు మాత్రమే ఉన్నది. కాబట్టి, వీలైనంత త్వరగా సీట్ల విషయంపై తేల్చాలని వారు సీఎం కేసీఆర్‌ను అడగనున్నారు.

Also Read: వాస్తు: ఇక్కడ సచివాలయం కూలగొట్టారు.. అక్కడ సింపుల్‌గా డోర్ తెరిచారు.. వాస్తు నమ్మేవారికి సీఎం సిద్ధరామయ్య షాక్

మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ విజయానికి వామపక్షాల పాత్ర కీలకంగా ఉన్నట్టు విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి మునుగోడు కాంగ్రెస్ సీటు. అక్కడ బీఆర్ఎస్ పాగా వేయడానికి వామపక్ష వాసనలు ఉన్న ఈ నియోజకవర్గంలో ఈ పార్టీల మద్దతు అధికార పార్టీకి కలిసి వచ్చింది. కాంగ్రెస్ బలమైన పోటీ ఇచ్చినా బీఆర్ఎస్ సీటు గెలుచుకోగలిగింది.