న్యాయవాద దంపతుల హత్య కేసు కొలిక్కి వస్తోందా? కేసులో ముందు నుంచీ ఊహించిన పుట్ట మధు ప్రమేయం ఇక లేనట్టేనా? మంథని పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లో పుట్టమధు పేర్లు తప్పించారా? హత్య కేసులో పుట్ట మధు పాత్రను కేవలం విచారణతోనే ముగించారా?

పెద్దపల్లి జిల్లాలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాదులు గట్టు హత్య కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్లో కోర్టుకు అప్లోడ్ చేశారు. కేసులో మొత్తం ఏడుగురు పాత్రధారులు, సూత్రధారులుగా తేల్చేశారు.

పోలీసులు అప్లోడ్ చేసిన చార్జిషీట్లో A1 కుంట శీను, A2 చిరంజీవి,  A3  అక్క పాక కుమార్, A4 బిట్టు శ్రీను, A5 ఊదరి లచ్చయ్య, A6 కాపు అనీల్, A7 గా వసంతరావును చేర్చారు. వారిని అరెస్టు చేసిన తర్వాత కస్టడీకి తీసుకుని జైలుకు పంపించారు.

తన కొడుకు వామన్ రావు, తన కోడలు నాగమణిల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు దంపతుల ప్రమేయం ఉందని కిషన్రావు ఐజీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీద విచారణ జరుగుతుండగానే ఈటెల రాజేందర్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. వెంటనే ఆయన మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు.

ఆయనకు సన్నిహితంగా ముద్రపడ్డ పుట్టమధును హత్య కేసులో ఇరికిస్తారన్న సమాచారంతో ఆయన ఫోన్ స్విచాఫ్ చేసి అదృశ్యమయ్యారు. వారం రోజులపాటు పుట్టమధు కోసం పోలీసులు వెతికారు. ఈ లోగా నాలుగైదు రాష్ట్రాలు, ఆరు సెల్ఫోన్లు, 4 కార్లు మార్చినట్టు పోలీసులు గుర్తించారు.

సాంకేతికత ఆధారంగా పుట్టమధును భీమవరంలో పట్టుకున్నారు. మూడు రోజుల పాటూ పోలీసులు రామగుండం కమిషనరేట్ విచారించారు. ఎందుకు కనపడకుండా పోయారు? ఫోన్ ఎందుకు స్విచాఫ్ చేశారు? అన్న ప్రశ్నలకు అదే పొరపాటు జరిగిందని పుట్టమధు వివరణ ఇచ్చారు.

అంతకుమించి కేసులో తన ప్రమేయంపై నోరు విప్పలేదని తెలిసింది. ఆ తర్వాత పుట్టమధు భార్య, మంథని మున్సిపల్ చైర్మన్ శైలజకు కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. తాజాగా వేసిన చార్జిషీట్లో ఇద్దరు పేరు లేదని తెలిసింది. న్యాయవాది వామన్ రావు తండ్రి మాత్రం పుట్టమధు సహా ఇతర పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపించారు.

కొడుకు కోడలు హత్యకు పుట్టమధు రెండు కోట్ల రూపాయలు  సుపారీ ఇచ్చారని కిషన్రావు ఐజి కి లేఖ రాశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న బిట్టు శ్రీను పుట్టమధుకు మేనల్లుడు. పుట్టమధును విచారిస్తున్న సమయంలో వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవ్వాలని పలు బ్యాంకులకు పోలీసులు లేఖ రాశారు.
 
ఐదు లక్షలకు మించి ఉన్న ప్రతి లావాదేవీ పైనా విచారణ జరిపారు. దీంతో వారి ప్రమేయం లేనట్లుగా తేల్చారు. పుట్ట మధును ఈటెలకు దూరం చేయడానికే విచారణ పేరుతో హడావుడి చేశారని ప్రచారం జరుగుతోంది. ఈటెలతో తనకు సంబంధం లేదన్న కబురును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. మొత్తం మీద పుట్టమధు దంపతుల పేరు లేకుండానే చార్జిషీట్ను కోర్టు అప్లోడ్ చేశారు.