హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో లావణ్య లహరి మృతి ఘటన పునరావృతమైంది. లావణ్య లహరి మాదిరిగానే భర్త వేధింపుల కారణంగా రోజా అనే వివాహిత మరణించింది. భర్త వీరేష్ ఆమెను గొంతు పిసికి హత్య చేశాడనే ఆరోపణలు వస్తున్నాయి. 

హైదరాబాదులోని పహడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని హర్షగుడాలో ఆ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పక్కా ప్లాన్ ప్రకారం తమ కూతురిని అత్తింటివారు హత్య చేశారని రోజా తల్లిదండ్రులు ఆరోపించారు. రోజా మృతదేహాన్ని తరలించకుండా అడ్డుపడుతూ ఆందోళనకు కూడా దిగారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చి నచ్చజెప్పడంతో వారు వెనక్కి తగ్గారు. 

రమావత్ వీరేష్ నాయక్, రోజా రెండున్నరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పొలం అమ్మి రోజా తల్లిదండ్రులు వరకట్నం కూడా ఇచ్చారు. అయితే, అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్తింటివారు రోజాను వేధిస్తూ వచ్చారు. వ్యాపారం చేయడానికి బంగారం ఇవ్వాలని రోజాను వేధించారని, రోజా బంగారం ఇవ్వడానికి నిరాకరించిందని, దీంతో ఆమెపై వేధింపులు మరింతగా పెరిగాయని అంటున్నారు.

Also Read: చనిపోవడానికి ముందు రోజు మాట్లాడా: టెక్కీ లహరి సోదరి

ఆ క్రమంలోనే భర్త వీరేష్ రోజా గొంతు పిసికి చీరెను కట్టి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని రోజా తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. రోజా, వీరేష్ దంపతులకు ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. కూతురు పుడితే చంపేస్తానని రోజాను మొదటి నుంచి అత్త వేధిస్తూ వచ్చిందని అంటున్నారు. తొలి చూలులో కుమారుడు పుట్టడంతో బతికిపోయిన రోజా రెండో చూలులో కూతురు పుట్టడంతో కూడా వేధింపులకు గురైందని చెబుతున్నారు. 

అత్తారంటివారు పెట్టే వేధింపులను తల్లిదండ్రులకు చెప్పి రోజా ఆవేదన చెందినట్లు కూడా చెబుతున్నారు. తల్లిదండ్రులు ఆమెకు ధైర్యం చెప్పారు. కానీ అదేమీ ఫలితం ఇవ్వలేదు. మూడు నెలల కూతురు గల రోజాను అత్తింటివారు పొట్టన పెట్టుకున్నారని అంటున్నారు.

Also Read: అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది: టెక్కీ లహరి చివరి వీడియో