హైదరాబాద్: ఒకే ఇంట్లో ఇద్దరు మరణించడంతో  ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అన్న చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక తమ్ముడు కూడ మృత్యువాతపడ్డాడు.  ఈ ఘటన శంషాబాద్ మున్సిఫల్ కేంద్రం సిద్దాంతిలో చోటు చేసుకొంది.

సిద్దాంతికి చెందిన రాచమల్ల సుదర్శన్ కు 55 ఏళ్లు. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ విభాగంలో ఆయన కోచ్ గా విధులు నిర్వహిస్తున్నారు.  గతంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకొన్నారు. విధుల్లో చేరాడు. 

ఈ ఏడాది జూన్ 29వ తేదీన సుదర్శన్ విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. తోటి ఉద్యోగి సహాయంతో ఆయన ఇంటికి చేరుకొన్నాడు. అదే రోజు రాత్రి ఆయనకు మరోసారి గుండెపోటు వచ్చింది.  

ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన మరణించాడు.  ఈ విషయానన్ని సుదర్శన్ సోదరుడికి కుటుంబసభ్యులు సమాచారం ఇచ్చారు.

హైద్రాబాద్ లో నివాసం ఉంటున్న సుదర్శన్ సోదరుడు  లవణ్ అన్న మృతదేహాన్ని చూసి తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగానే  మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. 

ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు గంటల వ్యవధిలో మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.సుదర్శన్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. లవణ్ కు ఇంకా పెళ్లి కాలేదు.