Asianet News TeluguAsianet News Telugu

ఆ పని వెన్నుల్లో వణుకు పుట్టించేది : కడియం హాట్ కామెంట్స్

అందుకే ఆ పనిని ఎవరూ ముట్టుకోలేదు

Land records streamlining is a hectic job: Kadiam

వరంగల్ : భూ రికార్డులను ప్రక్షాళన చేయడమంటే వెన్నులో వణుకుపుడుతుందన్నారు ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి. అందుకే ఇప్పటి వరకు ఎవరు దానిని ముట్టుకోలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి కేసిఆర్ మాత్రం రైతులకు ప్రతిసారి ఇలాంటి ఇబ్బందులు ఉండొద్దనే గొప్ప ఉద్దేశ్యంతో భూ రికార్డుల ప్రక్షాళన సజావుగా చేయించారని, పనిచేసినందుకు రెవెన్యూ సిబ్బందికి నెల వేతనాన్ని బోనస్ గా ఇచ్చారన్నారు. ఎమ్మార్వోలు, వీఆర్వోలు బాగా పనిచేయడం వల్లే ఈ రోజు రికార్డుల ప్రక్షాళన, రైతుబంధు పథకం విజయవంతమైందని, వీరందరికి ధన్యవాదాలన్నారు. అయితే కొంతమంది ఎమ్మార్వోలు, వీఆర్వోలు తప్పులు చేయడం వల్ల మిగిలిన వారికి కూడా చెడ్డపేరు వస్తుందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య రాబంధు పథకంగా అభివర్ణించడంపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా మండిపడ్డారు. రైతులకు ముఖ్యమంత్రి కేసిఆర్ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే...కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతుందని, అందుకే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని పట్టించుకోక, ఈ ప్రాంతాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేసి, ఇక్కడి నిధులు, నీళ్లు, నియామకాలు పక్క రాష్ట్రానికి వెళ్తుంటే మాట్లాడకుండా ఉన్నవాళ్లు నేడు రైతు బంధు పథకాన్ని రాబంధు పథకమంటే రైతులే వీరికి బుద్ధి చెబుతారన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వాలని, విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచాలని, భూ రికార్డులు ప్రక్షాళన చేయాలని, రైతులకు పంట పెట్టుబడి కింద ఏటా 8000 రూపాయలు ఇవ్వాలని, రైతు కుటుంబానికి బీమా కల్పించాలని ఏనాడైనా ఈ కాంగ్రెస్ మూర్ఖులకు ఆలోచన వచ్చిందా? అని ప్రశ్నించారు. ఆరోజు రైతులకోసం ఏం చేయాలని ఈ కాంగ్రెస్ నేతలు ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు. రైతు బంధు పథకం రాబంధు పథకం అని కాంగ్రెస్ నేతలంటున్నారు? దీనితో ఏకీభవిస్తారా? అని సమావేశంలోని రైతులను అడిగినప్పుడు కాంగ్రెస్ వాళ్లే రాబంధులు అని ముక్తకంఠంతో రైతులు చెప్పారు.

జనగామ జిల్లా రైతు బంధు పథకంలో పాస్ పుస్తకాలు, చెక్కు బుక్కుల పంపిణీలో జరిగిన లోటుపాట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేడు సమీక్ష చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు బండ ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, ప్రభుత్వ విప్ బోడెకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్ పర్సన్ గద్దల పద్మ, జీసీసీ చైర్మన్ గాంధీ నాయక్, కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, స్థానిక నేతలు, అధికారులు, రైతు సమన్వయ సమితి బాధ్యులు పాల్గొన్నారు. రైతు బంధు పథకం కింద రైతుకు పెట్టుబడి ఇవ్వడం దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ పార్టీ చేయలేదని, ఇంత మంచి కార్యక్రమం రైతులందరికీ ఉపయోగపడేలా అధికారులు, స్థానిక నేతలు, రైతు సమన్వయ సమితి నేతలు సమిష్టిగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. అర్హులైన ప్రతి రైతుకు పాస్ బుక్, పంట పెట్టుబడి వస్తుందని హామీ ఇచ్చారు.

        పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పినా కొంతమంది ఆధార్ కార్డును లింక్ చేసుకోవడానికి ముందుకు రావడం లేదని, కొన్ని పొరపాట్లు ఉండడం వల్ల పాస్ పుస్తకాలు కొన్నింటిని విత్ హెల్డ్ లో పెట్టారని, అన్ని సక్రమంగా ఉన్నా కొంతమంది స్థానికంగా ఉండకపోవడం వల్ల పాస్ పుస్తకాలను తీసుకోవడానికి ముందుకు రావడం లేదని ఇలాంటి కారణాల వల్ల వంద శాతం పూర్తి చేయలేకపోయామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ నెల రోజుల్లో ఇలాంటి పొరపాట్లన్ని సరిచేసి జూన్ 22వ తేదీ నాటికి వందశాతం పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి అందించాలని ముఖ్యమంత్రి కేసిఆర్ కలెక్టర్ల సమావేశంలో చెప్పారని, కచ్చితంగా రైతులందరికీ పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి అందుతుందని తెలిపారు.

        రైతు బంధు పథకం కింద పొరపాట్లు సరిచేయడంలో గ్రామ సభ నిర్వహించి రైతు సమన్వయ సమితి నేతలు, సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వీఆర్వోలు, ఎమ్మార్వోలు ఎలాంటి తప్పులు చేయకుండా ఈ పథకాన్ని విజయవంతం చేయాలన్నారు. గ్రామ సభ పెట్టి తప్పులు సరిదిద్దితే ఎవరైనా తప్పులు చేసిన వారు ముందుకు రావడానికి భయపడుతారని, వచ్చినా గ్రామస్తులే మందలిస్తారని, దీనివల్ల ఎవరికీ చెడ్డపేరు రాదని సూచించారు.

        ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి రైతు బీమా పథకం పాలసీలు రైతులకు అందిస్తారని, దీనికి విస్తృత ప్రచారం కల్పించి రైతులందరికీ చేరేలా పనిచేయాలని అధికారులు, రైతు సమన్వయ సమితి నేతలు, ప్రజా ప్రతినిధులను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చారన్నారు. దురదృష్టవశాత్తు రైతు చనిపోతే ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడకుండా ఉండేందుకు 5 లక్షల రూపాయల బీమాను ఈ పథకం కింద చేస్తున్నారన్నారు. ఇందుకోసం 60 లక్షల మంది రైతులకు ఒక్కో రైతు కోసం ఏటా 2270 రూపాయల ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ పథకం రైతులకు చాలా ఉపయోగపడేదని, దీనిని రైతుబంధు కింద లబ్ధి పొందిన ప్రతి రైతుకు అందేలా పనిచేయాలన్నారు. రైతుబంధు కింద గుంట భూమి ఉన్న రైతుకుగానీ, 50 ఎకరాలున్న రైతుకు కూడా 5లక్షల బీమానే అందుతుందన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios