Asianet News TeluguAsianet News Telugu

రెండో భార్య భూమి కొనుగోలు: కంట్లో కారం చల్లి వేటకొడవళ్లతో నరికి...

సూర్యాపేట జిల్లాలో రియల్టర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాదాస్పదమైన భూమిని కొనుగోలు చేయడమే రియల్టర్ గుర్రం శశిధర్ రెడ్డి హత్యకు దారి తీసినట్లు పోలీసులు గుర్తించారు. 

Land issue leads to the murder of Realtor in Suryapet district
Author
Suryapet, First Published Feb 17, 2021, 8:47 AM IST

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పొలంల మొబైల్ ఫోన్ లో మాట్లాడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి గుర్రం శశిధర్ రెడ్డిని కంట్లో కారం చల్లి, కత్తులూ వేటకొడవళ్లతో నరికి చంపారు. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడలో ఈ హత్య జరిగింది. 

భూ వివాదమే శశిధర్ రెడ్డి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. సూర్యాపేటకు చెందిన ఉప్పల శ్రీనివాస్ అలియాస్ అయిల్ శ్రీనుకు, అతని రెండో భార్య పద్మశ్రీకి మధ్య కుడకుడ శివారులో కొంత వివాదాస్పదమైన భూమి ఉంది. ఆ భూమిని శశిధర్ రెడ్డి ఆమె నుంచి భర్త శ్రీనివాస్ కు తెలియకుండా తక్కువ ధరకు కొన్ిాడు. ఆ తర్వాతి పరిణామాలు శశిధర్ రెడ్డి హత్యకు దారి తీశాయి. 

హత్య కేసులో ప్రధాన సూత్రధారి ఉప్పల శ్రీనివాస్ తో పాటు ఆరుగురిని పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మోహన్ కుమార్ మంగళవారంనాడు వెల్లడించారు. శశిధర్ రెడ్డి వివాదాస్పదమైన భూమిని కొనుగోలు చేయడంతో పాటు శ్రీనివాస్ కు చెందిన మరికొంత భూమిని ఆక్రమించుకుని రాతిస్తంభాలను హద్దులుగా పెట్టుకున్నాడు. ఆ భూమిలో శ్రీనివాస్ ను అడుగు పెట్టనీయలేదు, పైగా బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ఆ విషయాన్ని శ్రీనివాస్ మద్దిరాల మండలం చిన్నినెమిలకు చెందిన తన స్నేహితుడు షేక్ జానీకి వివరించాడు. జానీ గతంలో లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న సమయంలో తనకు పరిచయమైన వరంగల్ కు చెందిన అబ్బరమీన రమేష్ అలియాస్ ఇడ్లి రమేష్, గొట్టిముక్కల రాజిరెడ్డిలను పరిచయం చేశాడు. 

వారి ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్న కోడెపాకకు చెందిన మేదరి పేరియార్ అలియాస్ వేణు, వరంగల్ నగరానికి చెందిన మేకల రమేష్, పంగ రవి, మేకల ప్రవీణ్ లను నిరుడు 13వ తేదీన నకిరేకల్ కు పిలిపించుకున్ని శశిధర్ రెడ్డి హత్యకు ప్రణాళిక వేశారు. వారితో పాటు పూర్ణచందర్ రెడ్డి, గన్నారపు రవీందర్, వీరగోని శ్రీనివాస్, అంబాల కుమారస్వామి, ఈరా వినయ్ హత్యకు సహకరించడానికి అంగీకరించారు. 

గుర్రం శశిధర్ రెడ్డిని అంతకు ముందు మూడు సార్లు ప్రయత్నించి ముఠా విఫలమైంది. మొదట కుడకుడ సమీపంలో గల మీసేవ కేంద్రం ఒక్కసారి, సూర్యాపేట నుంచి భీమారం వెళ్లే దారిలో గల ఫంక్షన్ హాల్ వద్ద రెండోసారి, హైదరాబాదు సమీపంలోని ఆందోళ్ మైసమ్మ గుడి వద్ద మూడోసారి అతన్ని హత్య చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. 

చివరకు కుడకుడ శివారులోని గుర్రం శశిధర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం వద్ద పక్కా ప్లాన్ వేసి చంపారు. ఒక ఆటోలో, రెండు ద్విచక్రవాహనాలపై అతన్ని వెంబడించారు. మొబైల్ లో మాట్లాడుతుండగా గుర్రం శశిధర్ రెడ్డిని కంట్లో కారం చల్లి, కత్తులూ వేటకొడవళ్లతో నరికి చంపారు. 

శశిధర్ రెడ్డిని చంపేందుకు ముఠా సభ్యుల్లో ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు ఇచ్చేందుకు, ప్రధాన నిందితుడు శ్రీనివాస్ ఒప్పందం చేసుకున్నాడు. హత్య చేసిన తర్వాత వివాదాస్పద భూమిలోని ఒక్కో కుంట స్థలాన్ని కూడా ఇచ్చేందుకు అంగీకరించాడు.  

శశిధర్ రెడ్డి కదలికలను గుర్తించేందుకు నిందితులు ఆధునిక సాంకేతిక పరిజ్జానాన్ని వాడుకున్నారు. హత్యకు పది రోజుల ముదు శశిధర్ రెడ్డి కారుకు అయస్కాంత శక్తి కలిగిన జీపీఎఎస్ ట్రాకర్ ను అమర్చారు. మేదరి వేణు 15 రోజుల పాటు బ్యాటరీ సామర్థ్యం కలిగిన జీపీఎస్ ట్రాకర్ ను హైదరాబాదులో కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు.

ట్రాకర్ కు సంబంధించిన సాఫ్ట్ వేర్ ను వేణు తన మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకున్నాడు. దాంతో శశిధర్ రెడ్డి ఏ సమయంలో ఎక్కడికి వెళ్తున్నాడో గుర్తిస్తూ హత్యకు ప్రణాళిక వేసుకున్నారు. హత్యకు వాడిన రెండు కత్తులను, రెండు వేట కొడవళ్లను, ఆటోను, రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా జీపీఎస్ ట్రాకర్ ను, 16 మొబైల్స్ ను స్వాధీనం చేసుకుని 13 మంది నిందితులను కోర్టుకు రిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios