హైదరాబాద్: ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఇంజనీరుకు భర్త నుంచి తీవ్రమై చిక్కులు ప్రారంభమయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య పట్ల అతను అమానుషంగా ప్రవరిస్తున్నాడు. భార్యనే కాకుండా ఆమె తల్లిని కూడా కించపరుస్తూ ఫోన్లు చేయడం ప్రారంభించాడు. తన భార్య అత్త, భార్య సోదరి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి వాటి కింద అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను అశ్రయించింది.

హైదరాబాదులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఆమె పనిచేస్తోంది. తన సహోద్యోగిని ఆమె వివాహం చేసుకుంది. వివాహమైన తర్వాత తన తల్లికి, సోదరికి తన జీతంలో సగం ఇస్తానని పెళ్లికి ముందే అతనితో ఒప్పందం చేసుకుంది. ఇందకు సరేనన్నాడు. పెళ్లయిన రెండు నెలలకు అతనికి బెంగుళూరు బదిలీ అయింది. 

భర్త కోసం ప్రతి పదిహేను రోజులకు ఓసారి ఆమె బెంగళూరు వెళ్తూ ఉండేది. ఆరు నెలల తర్వాత తాను కూడా బెంగళూరుకు బదిలీ చేయించుకుంది. ఆ తర్వాత ఆమెకు అతని నుంచి వేధింపులు మొదలయ్యాయి. జీతం మొత్తం తనకే ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడు. లేదంటే పరువు తీస్తానంటూ హెచ్చరించాడు.

ఆమె అందుకు అంగీకరించకపోవడంతో తన రాక్షసప్రవృత్తిని బయటపెట్టాడు. హైదరాబాదులో తాను, తన భార్య, స్నేహితులు వివిధ సందర్భాల్లో తీసుకున్న ఫొటోలను తన భార్య, తన స్నేహితుల ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టు చేస్తూ వీరంతా దేశముదుర్లు అంటూ వ్యాఖ్యలు పెట్టడం ప్రారంభించాడు. 

తన భార్య, తన అత్త ఫొటోలను ఫేస్ బుక్ లో పెట్టి మీకు సాయంత్రాలు బోర్ కొడుతుందా.... వీరిని సంప్రదించండి అంటూ వ్యాఖ్యలు పెట్టేవాడు. అతని ఆగడాలను భరించలేక చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.