హైదరాబాద్: భర్త అనుమానం, వేధింపులు, ఆర్థిక ఇబ్బందులు ఓ మహిళా టెక్కీ బలన్మరణానికి కారణమయ్యాయి. మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం చీరతో ఉరేసుకుని మరణించింది.

హైదరాబాదులోని వనస్థలిపురానికి చెందిన జి. రేఖ (30) లంగర్ హౌస్ కు చెందిన ఉజ్వల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు. ఆ తర్వాత చందానగర్ లోని అపర్ణ గార్డినియాలో నివసిస్తున్నారు. 

ఇద్దరు కూడా గచ్చిబౌలిలోని ఐబిఎంలో పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు వనస్థలిపురంలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నిాయి. 

ఫోన్ లో మాట్లాడే విషయంలో భర్త ప్రవర్తనతో ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు మరింతగా పెరిగాయి. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్ కు వెళ్లారు. ఇంటికి వచ్చిన తర్వాత వేర్వేరు గదుల్లో పడుకున్నారు. 

ఆదివారం ఉదయం ఉజ్వల్ లేచి చూసేసరికి రేఖ మృతదేహం ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేఖ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.