మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం ఇటీవలేభూమిఅమ్మినవినోదఅనేగృహిణి అన్ని పెద్ద నోట్లు ఉండడంతో భయపడి అఘాయత్యం

పెద్ద నోట్లు రద్దు ఒకరి ప్రాణం తీసింది. తన దగ్గర ఉన్న పెద్ద నోట్లు ఇక చెల్లవని భావించి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వినోద అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జిల్లాలోని శెనగపురంలో బుధవారం చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన కందుకూరి వినోద(55) భర్తకు కొంత కాలం క్రితం పక్షవాతం వచ్చింది. దీంతో తమకు ఉన్న పన్నెండెకరాల వ్యవసాయ భూమిని రూ. 56.40 లక్షలకు అమ్మి వచ్చిన డబ్బుతో భర్తకు వైద్యం చేయించింది. వైద్యానికి రెండు లక్షలు ఖర్చుకాగా మిగిలిన డబ్బుతో మరో ప్రాంతంలో భూమి కొనడానికి యత్నిస్తోంది. ఈ క్రమంలో కేంద్రం పెద్ద నోట్లు చెల్లవని ప్రకటించడంతో భయాందోళనలకు గురైన వినోద విషయం భర్తకు, కుమారుడికి చెప్పింది.

దీంతో బుధవారం రాత్రి ఇంట్లో గొడవ జరిగింది. చెప్పిన వినకుండా భూమి మొత్తం విక్రయించడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందని వారు మందలించారు. దీంతో తన వద్ద ఉన్న 54 లక్షలు చెల్లని నోట్లుగా మిగిలిపోతాయని భావించిన వినోద.. కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.