టప్పర్‌వేర్ వ్యాపారం పేరిట 15 మందికి రూ.4 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన కిలాడీ లేడీని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ కిలాడీ చేతిలో మోసపోయిన వారు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి మొరపెట్టుకోగా ఆయన జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళితే.. నల్గొండ పట్టణంలోని శివాజీ నగర్‌కు చెందిన ఆకుల స్వాతి టప్పర్‌వేర్ వ్యాపారం పేరిట దుకాణం తెరిచింది. ఈ వ్యాపారంలో రూ.లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ. 30 వేల కమీషన్ వస్తుందని పలువురు మహిళలకు మాయమాటలు చెప్పింది.

ఆమె మాటల నమ్మిన మానస అనే మహిళ స్వాతికి రూ. కోటి 30 లక్షలు ఇచ్చింది. అదే కాలనీకి చెందిన యాట భారతమ్మ రూ.19 లక్షలు పెట్టుబడిగా వచ్చింది. అలా సుమారు 15 మందిని బుట్టలో వేసిన స్వాతి వారి నుంచి రూ. 4 కోట్లకు పైగా వసూలు చేసింది.

వరుసగా రెండు నెలల పాటు కమీషన్ డబ్బులు ఇచ్చింది. ఆ తర్వాత కమీషన్ ఇవ్వడం మానేసింది. దీంతో బాధితులంతా డబ్బులు అడగటం మొదలుపెట్టడంతో... డబ్బులు లేవంటూ బెదిరించసాగింది.

దీంతో వారంతా శనివారం ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన బాధితులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకున్నారు.

కమీషన్ల పేరిట మహిళలను లక్ష్యంగా చేసుకున్న ఆకుల స్వాతి దందాకు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ప్రాథమికంగా ఆమె ఇప్పటి వరకు రూ.4 కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టినట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు.

ఇంటి దగ్గరే వుండి రూ. లక్ష పెట్టుబడి పెడితే నెలకు రూ.30 వేల కమీషన్ వస్తుందని చెప్పడంతో ఒకరి ద్వారా మరొకరు చైన్ లింక్ తరహాలో పరిచయం ఏర్పడి వీరంతా లక్షల్లో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.

ప్రజల నుంచి కొట్టేసిన సొమ్ముతో కారు, ఇతర చోట్ల ఇంటి స్థలాలు కొనుగోలు, విలాసవంతమైన వస్తువులు కొన్నట్లు సమాచారం. బాధితులు ఎంతమంది..? స్వాతి వసూలు చేసిన డబ్బు..? ఎంత అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.