సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పై బదిలీ వేటు పడింది. నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ఓటు విషయంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడింది.

నేరేడుచర్ల చైర్మన్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఓటు వేసేందుకు కేవీపీ రామచంద్ర రావుకు ఈసీ అనుమతి ఇచ్చింది. అయితే, టీఆర్ఎస్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డితో పాటు పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. దీంతో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. 

Also Read: నేరేడుచర్లలో కేవీపీకి ఓటు: ఉత్తమ్ తో గొడవ, మైక్ విరగ్గొట్టిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

ఈసీ నిర్ణయం అమలు కాకపోవడంపై ఎన్నికల సంఘం (ఈసీ) సీరియస్ అయింది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ కు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అమోయ్ కుమార్ ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బదిలీ చేశారు.

నేరేడుచర్లలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా కాంగ్రెసు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు ఓటు వేయడానికి వచ్చిన సమయంలో వివాదం చోటు చేసుకుంది.. ఇక్కడ కాంగ్రెసు ఏడు, టీఆర్ఎస్ ఏడు వార్డులను గెలుచుకున్నాయి. మరో వార్డును కమ్యూనిస్టు పార్టీ గెలుచుకుంది. కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: దుర్మార్గంగా అడ్డుకుంటున్నారు: కేవీపీ ఓటు హక్కు గొడవపై ఉత్తమ్

రాష్ట్ర విభజన తర్వాత కేవీపీని తెలంగాణకు కేటాయించారు. టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు, కాంగ్రెసు ఎంపీ హనుమంతరావు ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నేరేడుచర్లలో టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ బోడకంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. కాంగ్రెసు నుంచి ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెసు ఎంపీ కేవీపీ రామచంద్రరావు కూడా ఎక్స్ అఫిషియో సభ్యుడిగా దరఖాస్తు చేసుకున్నారు 

టీఆర్ఎస్ కు ముగ్గురు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి పది మంది బలం ఉండగా, ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిపి సీపీఐ మద్దతుతో కాంగ్రెసు బలం కూడా 10కి చేరింది. దీంతో టీఆర్ఎస్ కేవీపీని అడ్డుకునే ప్రయత్నం చేసింది.