Asianet News TeluguAsianet News Telugu

ఉత్తమ్ కు ఎర్త్?: జవాబు దాటేసిన కుంతియా సంకేతం అదే...

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎర్త్ పెట్టినట్లే కనిపిస్తోంది

Kuntia evades answer to question on Uttam

న్యూఢిల్లీ: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎర్త్ పెట్టినట్లే కనిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు వచ్చిన వార్తలను తెలంగాణ కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ కుంతియా ఖండించారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి అధ్యక్షుడిగా కొనసాగిస్తారా అని మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన జవాబు దాటేశారు. 

కుంతియా జవాబు దాటేయడాన్ని బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎసరు పెట్టినట్లేననే ప్రచారం ముమ్మరమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెసు నేతలు ఫిర్యాదు చేశారనే వార్తల్లో నిజం లేదని కుంతియా స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీతో భేటీలో తాను కూడా ఉన్నానని, సమావేశంలో ఎవరూ ఎవరికీ వ్యతిరేకంగా ఫిర్యాదు చేయలేదని ఆయన చెప్పారు. ఫిర్యాదు చేశారనే వార్త కేవలం పుకారు మాత్రమేనని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా కొనసాగితే 15 సీట్లు మాత్రమే వస్తాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాహుల్ గాంధీతో చెప్పారనే విషయంపై తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన అన్నారు. 

కాగా, రాహుల్ గాంధీని కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటు డికె అరుణ, మల్లుభట్టి విక్రమార్క తదితరులు కలిశారు. వారు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ మొదటి నుంచీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. 

తాజా పరిణామాల నేపథ్యంలో డికె అరుణ కూడా ఆయనకు వ్యతిరేకమైనట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహారశైలిపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీపీసీసి పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్నదే.

ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసమ్మతి రాగాన్ని వారు పెంచినట్లు కనిపిస్తోంది. తాజా పరిణామాలను పరిశీలిస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిసిసి పదవి నుంచి తొలగిస్తారనే అభిప్రాయం బలపడుతోందని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios