కేసీఆర్, చంద్రబాబు రావాలి: కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు

Kuamaraswamy invites KCR to fight against BJP
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో జెడిఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో జెడిఎస్ నేత కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి వ్యతిరేకంగా తాము ప్రాంతీయ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.

బిజెపియేతర పార్టీల నేతలు తమ పోరాటానికి కలిసి రావాలని ఆయన కోరారు. ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూనుకోవాలని ఆయన అన్నారు.  మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ కూడా కలిసి రావాలని ఆయన అన్నారు. కేంద్రంపై పోరాటానికి సారథ్యం వహించాలని తాను దేవెగౌడను కోరుతానని చెప్పారు.

బిజెపి వైపు రావాలని కాంగ్రెసు ఎమ్మెల్యేపై ఈడిని ప్రయోగించి ఒత్తిడి తెచ్చారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తనపై ఈడిని ప్రయోగించాలని చూస్తున్నారని, తాను తన ప్రయోజనాలను కాపాడుకోవడం అవసరమని ఆనంద్ సింగ్ అన్నట్లు ఆయన తెలిపారు. ఆనంద్ సింగ్ కాంగ్రెసు శాసనసభ్యుల సమావేశానికి హాజరు కాని విషయం తెలిసిందే.

నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి బిజెపి చూస్తోందని, తమ ఎమ్మెల్యేలను రక్షించుకోవడమే తమ పథకమని అన్నారు. సంస్థలను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని అన్నారు.

సంఖ్యాబలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ యడ్యూరప్పను ఆహ్వానినించారని, గవర్నర్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆయన అన్నారు.

loader