Asianet News TeluguAsianet News Telugu

పారిశ్రామికాభివృద్ధికి నిధులివ్వండి.. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేటీఆర్ లేఖ

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం కేటీఆర్ లేఖ రాశారు. గడిచిన ఎనిమిదేళ్లుగా కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఎలాంటి ఫలితం లేదన్నారు. 

ktr writes letter to union finance minister nirmala sitaraman over industrial development in telangana
Author
First Published Jan 14, 2023, 8:28 PM IST

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి సహకరించాలని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు శనివారం కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్ట్‌లకు జాతీయ ప్రాధాన్యత వుందని.. హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్ - నాగపూర్, హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్‌లకు ఆర్ధిక సాయం చేయాలని కేటీఆర్ కోరారు. బ్రౌన్ ఫీల్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల మంజూరు, అప్‌గ్రేడేషన్ కూడా చేయాలని మంత్రి కోరారు. ఆదిలాబాద్‌లోని సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని.. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని, చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలని, ఐటీఆర్ లేదా సమాన ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆయన కోరారు. 

ఇకపోతే.. గత ఆదివారం కూడా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని నగరాలు, పట్టణాలకు నిధులు విడుదల చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం .. కేంద్రం నుంచి నిరాశే ఎదురవ్వడం షరా మామూగా మారిందన్నారు. హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాలకు ఈసారి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేటీఆర్ కోరారు. కేంద్రం మొండిచేయి చూపినా అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతి కనబరుస్తోందని.. ఇందుకు కేంద్రం ఇచ్చిన అవార్డులు, రివార్డులే నిదర్శనమని కేటీఆర్ గుర్తుచేశారు. తమ ప్రయత్నానికి ప్రోత్సహకంగా నిధులు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై వివక్షతోనే కేంద్రం నిధులు కేటాయించడం లేదని కేటీఆర్ ఆరోపించారు. 

Also Read: మాలాగా కష్టపడి కాదు.. కుటుంబాన్ని అడ్డు పెట్టుకుని మంత్రయ్యాడు : కేటీఆర్‌పై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇదిలావుండగా.. గత కొంతకాలంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం తెలంగాణకు కేంద్రం విడుదల చేసిన నిధులకు సంబంధించి ఇద్దరి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తామంతా  కష్టపడి పైకి వచ్చామని.. కేటీఆర్ మాత్రం కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి అయ్యాడని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలంటే సూర్యుడిపై ఉమ్మేసినట్లేనని ఆయన దుయ్యబట్టారు. కేసీఆర్ కంటే కేటీఆర్ దిగజారి మాట్లాడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios