Asianet News TeluguAsianet News Telugu

వేములవాడను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తాం.. మంత్రి కేటీఆర్

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

KTR says will develop vemulawada like Yadadri
Author
First Published Feb 7, 2023, 2:16 PM IST

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడను యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వేములవాడలో జరగనున్న మహా శివరాత్రి వేడుకలకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే రమేష్‌బాబు, సంబంధిత అధికారులతో కలిసి కేటీఆర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. వేములవాడ ఆలయంలో జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. 

శివరాత్రి సందర్భంగా వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. పట్టణంలో ఉత్సవాల సందర్భంగా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని సౌక‌ర్యాలు, వ‌స‌తులు క‌ల్పించాల‌ని సూచించారు. ముందుజాగ్రత్త చర్యగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక సేవలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆలయంలో జాతరకు అన్ని ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.

ప్రతి ఏడాది మాదిరిగానే వేములవాడలో ఈసారి కూడా ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందుకు రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం ఉండాలని సూచించారు. ఇక, ఈ సమీక్షా సమావేశంలో వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మంత్రి కేటీఆర్‌కు వివరించారు.

యువత కోసం వేములవాడలో మినీ స్టేడియం నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ అన్నారు. కొదురుపాక నుంచి వేములవాడ వరకు నాలుగు లైన్ల రహదారిని అభివృద్ధి చేయాలని, నాంపల్లి గుట్ట వద్ద రెండో ఘాట్‌ రోడ్డు నిర్మాణంపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల, వేములవాడలు రాష్ట్రంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయని.. తదనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. వేములవాడ దేవస్థానం ట్యాంక్‌బండ్‌ను వరంగల్‌ తరహాలో పటిష్టం చేసి అభివృద్ధి చేయాలని సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios