ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు  సాంగ్‌ను ఆస్కార్ వరించింది. అయితే ఈ సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించింది. ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ‘నాటు నాటు’ పాట పాట ఆస్కార్ సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్టు చేస్తున్నారు. 

నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించడంపై ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన తెలంగాణ ప్ర‌భుత్వ డిజిట‌ల్ మీడియా డైర‌క్ట‌ర్ కొణ‌తం దిలీప్‌.. గతంలో బండి సంజయ్ మాట్లాడిన ఓ వీడియోను పోస్టు చేసి విమర్శలు గుప్పించారు. చంద్రబోస్ రాసిన నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టీమ్‌కి అభినందనలు అని కొణతం దిలీప్ ట్వీట్ చేశారు. ఈ సినిమాపై బండి సంజయ్ లాంటి మతోన్మాదులు ఎలాంటి విషం చిమ్మారో గుర్తుంచుకోవడానికి ఇదే సరైన సమయమని అన్నారు. అలాంటి ద్వేషపూరిత వ్యక్తులను తిరస్కరిద్దామని పేర్కొన్నారు. 

అయితే కొణతం దిలీప్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. బండి సంజయ్‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. ‘‘ఇంకేముంది.. మోడీ వల్ల మాత్రమే ఈ అవార్డు వచ్చిందని సేమ్ బిగాట్ చెబుతాడు’’ అని కేటీఆర్ ట్విట్ చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మద్దతుదారులు ఈ ట్వీట్‌ను సమర్ధిస్తూ కామెంట్స్ చేస్తుంటే.. బీజేపీ మద్దతుదారులు మాత్రం కేటీఆర్ ట్వీట్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Scroll to load tweet…

ఇదిలా ఉంటే.. నాటు నాటు సాంగ్‌ను ఆస్కార్ వరించిన సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర యూనిట్‌‌కు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. నాటు నాటు, ఆర్‌ఆర్‌ఆర్ సాధించిన గౌరవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో కోట్లాది మంది భారతీయులతో తాను కూడా కలిసి ఉన్నానని తెలిపారు.. చరిత్ర సృష్టించిన కీరవాణి, చంద్రబోస్‌లకు కుడోస్ అని పేర్కొన్నారు. భారతదేశం గర్వపడేలా చేసిన అద్భుతమైన కథకుడు, మ్యాన్‌ ఆఫ్ ది మూమెంట్ రాజమౌళి, సోదరులైన సూపర్ స్టార్స్ రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లతో పాటు నాటు నాటు పాటకి సహకరించిన ప్రతి ఒక్కరూ చేసిన అద్భుతమైన పనికి అభినందనలు తెలుపుతున్నట్టుగా పేర్కొన్నారు. ‘‘టేక్ ఏ బో.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్..’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.