హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. బయ్యారం ఉక్కుకర్మాగారంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబు నాయుడు దిగిపోయే వ్యక్తి అని తాము అయిదేళ్లు ఉండే వాళ్లమని కచ్చితంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు.

ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వేచి చూస్తున్నట్లు తెలిపారు. పునర్విభజన చట్టంలోని అంశం అయిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఇస్తే పర్వాలేదని లేని పక్షంలో తాము పనులు చేపడతామని తెలిపారు. 

ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం అసెంబ్లీలో ప్రస్తావించారని తెలిపారు. కేంద్రం ఒప్పుకోకపోతే తమ ప్రభుత్వమే నిర్మిస్తోందని లేదా సింగరేణి ఆ బాధ్యత తీసుకుంటుందని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని తెలిపారు. 

చంద్రబాబులా ఆదరా బాదరాగా రాళ్లు వేసి ప్రజల నెత్తిన టోపి పెట్టే ఆలోచనలు తమకు లేవన్నారు. ఒక పద్ధతి ప్రకారం సవ్యంగా ప్రణాళికా బద్దంగా పని చేసే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. చంద్రబాబులా ప్రజలను మోసం చెయ్యడం తమకు చేతకాదన్నారు.