హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రూ.1000 కోట్లు ఇచ్చామంటూ టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటకే కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్ జగన్ కోట్లు వేసుకుంటారా అంటూ సెటైర్లు వేశారు. తమకు ఎలాంటి ఐరన్ షాపులు లేవని అలాంటిది వెయ్యికోట్లు ఎలా పంపిస్తానంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. వైఎస్ జగన్ కు రూ.1000కోట్లు ఇవ్వాల్సినంత అవసరం తమకేముందని నిలదీశారు. 

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు రూ.1000కోట్లు ఎలా ఇస్తారో ఎలా తీసుకెళ్లారో చెప్పాలి కదా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను ఒక్కసారే కలిశానని చెప్పుకొచ్చారు. 

ఫెడరల్ ఫ్రంట్ కోసం మద్దతు కోరుతూ కలిశానని అంతే తప్ప ఇంకెప్పుడు కలవలేదని కలవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఫెడరల్ ఫ్రంట్ కు సహకరిస్తే తాము ప్రత్యేక హోదా కోసం అండగా నిలబడతామని హామీ ఇచ్చామని అంతే తప్ప తమ మధ్య ఇంకెలాంటి చర్చ జరగలేదన్నారు. 

తాము జగన్ తో ఎందుకు కుమ్మక్కు కావాల్సి ఉంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల మధ్యవిద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

తాము తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఏం చేశామో అవి చెప్పుకూంటూ వెళ్లామని కానీ చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఐదేళ్లలో ఏం చేశామో ఒక్కటి కూడా చెప్పకుండా కేసీఆర్ పై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ను తిడితే ఓట్లు పడతాయని అనుకోవడం చంద్రబాబు నాయుడు భ్రమ మాత్రమేనని చెప్పుకొచ్చారు కేటీఆర్. 

ఈ వార్తలు కూడా చదవండి

వంశీ ఎవరో నాకు తెలియదు, వీళ్ల ఆస్తులు కూడా ఇక్కడే: కేటీఆర్