హైదరాబాద్: తెలంగాణలో ఆస్తులు ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, కార్యకర్తలను తాను బెదిరిస్తున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాము ఎవరిని బెదిరించడం లేదని బెదిరించాల్సిన అవసరం తమకేముందని చెప్పుకొచ్చారు. 

ఓ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మాట్లాడిన కేటీఆర్ వల్లభనేని వంశీమోహన్ అనే ఎమ్మెల్యే ఎవరో తనకు తెలియదన్నారు. అలాంటిది తాను ఆయన్ను బెదిరించానని ప్రచారం చేసుకుంటున్నారని ఇది దుర్మార్గమన్నారు. 

కనీసం వంశీకి ఎక్కడ స్థలం ఉందో ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చారు. ఏపీలో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ఇక్కడే ఆస్తులు ఉన్నాయని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణలోనే ఆస్తులు ఉన్నాయని తెలిపారు. 

ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన రూ.350 కోట్ల రూపాయల ఆస్తులు హైదరాబాద్ లోనే ఉన్నాయని చూపించారని తెలిపారు. అలాగే నారా లోకేష్ కు సంబంధించి ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయన్నారు. 

ఇకపోతే వైఎస్ జగన్ 360 కోట్లు చూపించారని ఆ ఆస్తులు కూడా తెలంగాణలోనే ఉన్నట్లు చూపించారని తెలిపారు. ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఫిడవిట్ లో చూపించిన రూ.52 కోట్ల ఆస్తులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని చూపించారని, ఆయనకు ఫామ్ హౌస్ కూడా ఇక్కడే ఉందన్నారు. 

అంతేకాకుండా వందల కోట్లతో చంద్రబాబు నాయుడు ఇక్కడే మరో ఇళ్లు కడుతున్నారని చెప్పుకొచ్చారు. తాము ఎవరిని బెదిరించడం లేదని, వారికి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఓడిపోతే హైదరాబాద్ లో కడుతున్న ఇంటిలోనే మనవడు దేవాన్ష్ తో కలిసి ఆడుకుంటారని కేటీఆర్ జోస్యం చెప్పారు.