హైదరాబాద్: వ్యవసాయ బిల్లులపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమే అయితంే రైతులు ఎందుకు సంబురాలు చేసుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. 

ఎన్డీఎ భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నాయని ఆయన అడిగారు. గత వారంలో తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లులను ఆమోదించినప్పుడు రైతులంతా ఆనందంతో ఉప్పొంగిపోయారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన రైతులందరూ సంబురాలు చేసుకున్నారని ఆయన అన్నారు. తాము రైతు స్నేహపూర్వక రెవెన్యూ బిల్లులను తెచ్చామని ఆయన అన్నారు.

 

రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కొత్త రెవెన్యూ బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూవివాదాల శాశ్వత పరిష్కారం దిశగా ఈ బిల్లులను తెచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. 

ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ ప్రధాన నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించింది. వచ్చే జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరి తీసుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.