కేటీఆర్, పవన్ కల్యాణ్ ల మధ్య చిగురిస్తున్న స్నేహ బంధం

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారికి కూడా ఈ విషయం బాగా ఒంటబట్టినుంది. ఇందుకు సినీ హీరో, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ ల స్నేహమే నిదర్శనం.

రాష్ట్ర విభజనపై మండిపోతూ ఆ ఆగ్రహజ్వాలతోనే పవన్ పార్టీ పెట్టారనేది వాస్తవం. విభజనకు కారణమైన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్డీయే కూటమితో ఆయన జతకట్టారు. ఇక తెలంగాణలో సమైక్యవాదిగా గుర్తింపు పొందిన జగ్గారెడ్డి అంటే పవన్ కు ప్రాణం. ఆయనకు గత ఎన్నికల్లో మద్దతు కూడా ప్రకటించారు.

రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు కావొస్తున్నా పవన్ మాత్రం ఓ మాటను తన ప్రసంగంలో పదే పదే ప్రయోగిస్తుంటారు. రాష్ట్రాన్ని అడ్డంగా విభజించారు. ఆంధ్రులను కట్టుబట్టలతో గెంటేశారు అంటూ తెలంగాణ మీద తనకున్న వ్యతిరేకతను అడగడుగునా ఆయన వ్యక్త పరుస్తూనే ఉంటారు.

గత ఎన్నికల వేళ కేసీఆర్, కవిత, టీఆర్ఎస్ పార్టీపై పవన్ తనదైన శైలిలో విరుచపడ్డారు. దీనికి కేసీఆర్ ఫ్యామిలీ కూడా దీటుగానే సమాధానం ఇచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎన్నికలు అయిపోయాయి. ఇక పవన్ కూడా ఈ మూడేళ్లలో రాజకీయాలు బాగానే ఒంటబట్టించుకున్నారు.

ఇక కేసీఆర్ వారసులు కేటీఆర్, కవిత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్లు తండ్రిబాటలోనే నడుస్తున్నారు. తెలంగాణపై విషం చిమ్ముతున్నాడు అని అప్పట్లో పవన్ పై విరుచుకపడిన వాళ్లే ఇప్పుడు పవన్ ను పొగిడేస్తునారు. అన్న దుకాణం మూసిండు తమ్ముడు దుకాణం తెరిచిండు అన్న వాళ్లే ఇప్పుడు ఆయన సినిమాలు చూసి ముగ్దులైపోతున్నారు.

తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్... పవన్ లేటెస్టు మూవీ కాటమరాయుడు సినిమా చూశారు. పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను ట్విటర్ లో షేర్ చేశారు. పవన్ నిజంగా విజేతనే అని ప్రశంసించారు. చేనేతకు పవన్ ప్రోత్సాహం అభినందనీయమని కొనియాడారు.గతంలో రాంచరణ్ సినిమా వేడుకల్లో కూడా కేటీఆర్... పవన్ ను ప్రశంసించారు. అంతకు ముందు అమరావతిలో కవితక్క చేసిన ప్రసంగాన్ని కూడా పవన్ పొగిడారు.

కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఇలా విభేదాలు పక్కనపెట్టి, సిద్దాంతాలను మూటగట్టి కలిసిపోవడం నిజంగా అభినందనీయం.