హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు ఆలయాల చుట్టూ తిరిగిన దాఖలాలు లేవు. తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిరిగా ఆయనకు యాగాలు, యజ్ఞాలపై కూడా విశ్వాసం ఉన్నట్లు కనిపించదు. 

కేసీఆర్ దేవాలయాలకు వెళ్లినప్పుడు కూడా కేటీఆర్ వెళ్లేవారు కారు. తన కుటుంబ సభ్యులను కేసీఆర్ వెంట పంపించి తాను మాత్రం దూరంగానే ఉండేవారు. మతపరమైన ఉత్సవాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటూ వస్తున్నారు.

కేటీఆర్ కర్మ మీద మాత్రమే విశ్వాసం పెట్టుకునేవారు. కేసీఆర్ తో పాటు ఆయన యాగాల్లో పాల్గొన్న సందర్భాలు కూడా లేవు. కేసీఆర్ యజ్ఞాలు నిర్వహించినప్పుడు అతిథులను ఆహ్వానించడం వరకే పరిమితమయ్యే వారు. 

అకస్మాత్తుగా కేటీఆర్ లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన కూడా ఆలయాలకు వెళ్తూ దైవ దర్శనాలు చేసుకుంటున్నారు. ఇటీవల ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరి ఆలయానికి కేసీఆర్ తో పాటు వెళ్లారు. ఆలాగే, శ్రీవారి దర్శనానికి తన కుటుంబ సభ్యులందరితో పాటు వెళ్లారు. 

ఈ ఏడాది రాజయోగం ఉందని కేటీఆర్ కు కొంత మంది జ్యోతిష్యులు మాత్రమే కాకుండా త్రిదండి చినజీయర్ స్వామి కూడా చెప్పారని అంటున్నారు. రాజయోగం ఉన్నందున దేవదర్శనాలు చేసుకోవాలని వారు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.

ఆలయాలకు వెళ్లి పూజలు చేయాల్సిందిగా కేసీఆర్ కూడా కేటీఆర్ కు చెప్పినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. దాంతో కేటీఆర్ ఆలయాలకు వెళ్తూ దైవదర్శనాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.