టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడిన తర్వాత కేటీఆర్ తన బావ.. సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశానికి వీరిద్దరూ హాజరవుతారు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ తొలిసారి తెలంగాణ భవన్‌కు రానున్నారు. అంతకు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించబడిన కేటీఆర్‌కు హరీశ్ రావు ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి థాంక్స్ బావా అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలో కేటీఆర్.. హరీశ్ ఇంటికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ నియమించబడటంతో ఆయనకు ఉదయం నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు కేటీఆర్‌కు వ్యక్తిగతంగా, ట్వీట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.