రేవంత్ బాటలో కేటిఆర్

Ktr looks following in the foot steps revanth reddy
Highlights

  • రేవంత్ చేసిన పనే కేటిఆర్ చేస్తున్నారు
  • కేటిఆర్ స్వరం మారడం వెనుక మతలబు ఉందా?
  • ఆ రెండు లక్ష్యాల కోసమేనా ?

తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటిఆర్ ఇటీవల చేసిన ఒక్క కామెంట్ తెలుగు రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆ చిన్న కామెంట్ చుట్టే రాజకీయ పండితులంతా చర్చోపచర్చలు చేస్తున్నారు. కేటిఆర్ చేసిన ఆ కామెంట్ చూస్తే ఆయన రేవంత్ రెడ్డి బాటలోనే నడుస్తున్నారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకూ ఆ వివరాలేంటబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

ఇటీవల తన రాజకీయ జీవితంలో తొలిసారిగా కేటిఆర్ చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. సైబరాబాద్ సృష్టికర్త చంద్రబాబే అని పొగడ్తలతో ముంచెత్తారు. పొద్దున లేస్తే చంద్రబాబును చీల్చి చెండాడే కేటిఆర్ ఉన్నఫలంగా ఎందుకలా మారిపోయారబ్బా అని సర్వత్రా చర్చ జరుగుతోంది. కేటిఆర్ స్వరం మార్చడం వెనుక అనేక కారణాలున్నాయని చెబుతున్నారు.

ఇప్పుడు సీన్ కట్ చేసి రేవంత్... ఇష్యూలోకి ఎంటర్ అయిదాం. రేవంత్ రెడ్డి నెలరోజుల కిందట టిడిపి వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆయన టిడిపిని వీడకముందు కానీ.. వీడిన తర్వాత ఈ నెల రోజుల్లో కానీ.. ఏనాడూ తెలుగుదేశం పార్టీని పల్లెత్తు మాట అనలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును కూడా చిన్న మాట కూడా అనకుండా కేవలం తన ఏకైక శత్రువు కేసిఆర్ కుటుంబమే అన్నట్లు ఈ ఒక్క పాయింట్ కే పరిమితమై మాట్లాడుతున్నారు. గతంలో చాలామంది తెలంగాణ టిడిపి నేతలు పార్టీ మారారు. కేసిఆర్, నాగం జనార్దన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న లాంటి నేతలంతా చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించి పార్టీ మారిన పరిస్థితి ఉంది. కానీ వారందరికీ భిన్నంగా రేవంత్ రెడ్డి చిన్నమాట కూడా అనకుండానే పార్టీ మారిపోయారు. అంతేకాదు చంద్రబాబు ఆశిస్సులు తీసుకునే పార్టీ మారినట్లు కూడా చెప్పుకున్నారు. పాత తరం నేతలు అలా ఎందుకు చేశారు? రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు చేశారన్న చర్చ ఇంకా సాగుతూనే ఉంది.

అయితే రేవంత్ సాఫ్ట్ గా పార్టీ మారడం వెనుక పెద్ద ఆలోచనే ఉన్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో టిడిపికి సొంతంగా గెలిచి అధికారంలోకి వచ్చే బలం ప్రస్తుతానికి లేదు. అలా అని తెలంగాణలో టిడిపికి కేడర్ లేదని కాదు. తెలంగాణలోని బిసి వర్గాలు ఇంకా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నాయి. కేసిఆర్ ఎంతగా ప్రయత్నించినా లీడర్లు పార్టీ మారారు కానీ.. టిడిపికి ఉన్న బిసి ఓటు బ్యాంకును మాత్రం కేసిఆర్ కొల్లగొట్టలేకపోయారు. ఈ విషయంలో టిఆర్ఎస్ ఇప్పుటికీ అంతర్మథనం చేస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి పార్టీ మారినా.. టిడిపికి ఉన్న బలమైన బిసి సామాజికవర్గాలను దూరం చేసుకోవద్దన్న ఉద్దేశంతోనే టిడిపిని కానీ, బాబును కానీ చిన్నమాట అనలేదని చెబుతున్నారు. ఇదే కాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వచ్చి చేరిన సీమాంధ్ర సెటిలర్స్ ఓటింగ్ కూడా సుమారు 30 నియోజకవర్గాల్లో భారీగా ప్రాభల్యం చూపుతుంది. అందులో కమ్మ కులస్తుల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని రేవంత్ వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. రేవంత్ పేరుకే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. టిడిపిలో ఇప్పటికీ ఆయనకు భారీ ఫాలోయింగ్ ఉంది. రేవంత్ తో పాటే కాంగ్రెస్ లో చేరకపోయినా.. టిడిపిలో ఉంటూనే రేవంత్ మావాడే అని చెప్పుకుంటున్నారు. రేపటి ఎన్నికల్లో టిడిపి కేడర్ ఓటింగ్ ను మైండ్ గేమ్ ద్వారా కాంగ్రెస్ కు మల్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

ఇక ఎన్నికల తరుణం ముంచుకొస్తున్న నేపథ్యంలో టిడిపికి ఇంకా బలంగా ఉన్న బిసి ఓటింగ్ ను తమవైపు తిప్పుకోవడం, అలాగే హైదరాబాద్ లో సెటిలర్లు, కమ్మ కులస్తుల ఓటు బ్యాంకును రాబట్టాలంటే చంద్రబాబును తిట్టడం కంటే మెచ్చుకుంటే మేలు అన్న అంచనాకు టిఆర్ఎస్ నేత కేటిఆర్ వచ్చారా అన్న అనుమానాలైతే కలుగుతున్నాయి. ఎందుకంటే రాజకీయ జీవితంలో ఒక్కసారి కూడా మెచ్చుకోవడానికి ఇష్టపడని మనిషి ఉన్నఫలంగా స్వరం మార్చి పొగడ్తల వర్షం కురిపించడం దీనికి సంకేతంగా చెబుతున్నారు. నిజంగా కేటిఆర్ ఇలా బాబుపై పొగడ్తలు కురిపించారో లేదో.. వెంటనే టిడిపి కేడర్ లో ఇప్పటి వరకు ఉన్న వ్యతిరేక భావన తొలగిపోయే వాతావరణం కనబడుతోంది. ఇదే ఒరవడి రానున్న రోజుల్లో కూడా టిఆర్ఎస్ కొనసాగిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని బిసి ఓటు బ్యాంకు, హైదరాబాద్ చుట్టూ ఉన్న కమ్మ అండ్ సెటిలర్ ఓటు బ్యాంకులో కొంతలో కొంతైనా టిఆర్ఎస్ వైపు తిప్పుకునే చాన్స్ ఉంటుందేమో అని టిడిపి వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

దీంతోపాటు ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా జరుపుతున్నా.. సాటి తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పంపకపోవడం పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శల నుంచి జనాలను డైవర్ట్ చేయడం కోసమే కేటిఆర్ పొగడ్తల వర్షం అన్నవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా టిడిపి కి ఉన్న రెండు బలాలను రేవంత్ రెడ్డి గుండుగుత్తగా కొట్టేయకుండా కేటిఆర్ కొత్త ఎత్తుగడ షురూ చేశారన్న చర్చ ఉంది. అదే నిజమైతే రేవంత్ బాటలోనే కేటిఆర్ నడుస్తున్నట్లు చెప్పొచ్చేమో ?

loader