మహబూబ్ నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, అమరరాజా గ్రూప్ నుంచి గల్లా అరుణ, గల్లా జయదేవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణపై పెట్టుబడిదారులలో మారుతున్న అవగాహనకు అమరరాజా యాజమాన్యం చూపుతున్న ఆసక్తి అద్భుతమైన ఉదాహరణ అని చెప్పారు.
లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్‌లో భారతదేశంలోనే ఇది అతి పెద్ద పెట్టుబడి అని కేటీఆర్ పేర్కొన్నారు. అమరరాజా గ్రూప్ రూ. 9,500 కోట్ల పెట్టుబడిని పెడుతున్నందుకు వారికి థాంక్స్ చెప్పారు. ఒక పరిశ్రమను తీసుకురావడానికి చాలా కృషి చేయాల్సి ఉంటుందని అన్నారు. తాను పారదర్శకతతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. తెలంగాణలోని దివిటిపల్లిలో ప్లాంట్ పెడుతామని అమరరాజా గ్రూప్ ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి తమ తమ రాష్ట్రాలకు రావాలని ఆహ్వానించారని అన్నారు. అయితే అమరరాజా గ్రూప్ వారు ఇక్కడే ప్లాంట్ ప్రారంభించేందుకు సముఖత వ్యక్తం చేశారని చెప్పారు. అమరరాజా గ్రూప్ రాబోయే 10 ఏళ్ల కాలంలో రూ. 9,500 కోట్ల పెట్టుబడి పెట్టబోతుందని చెప్పారు. అమరరరాజా కంపెనీ 37 ఏళ్లలో పెట్టుబడులను పరిశీలిస్తే.. దానికి రెట్టింపు ఈ ఒక్క ప్లాంట్‌లోనే పెట్టుబడి పెడుతున్నారు. అమరారాజ యూనిట్ రావడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పారు.
10 ఏళ్ల క్రితం ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని.. ఇప్పుడు అంతా కొత్త రాష్ట్రానికి ఎంతో మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. తెలంగాణలో గిగాఫ్యాక్టరీని కలిగి ఉండటం వల్ల రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా మారాలనే ఆకాంక్షను నెరవేర్చడంలో సహాయపడుతుందని చెప్పారు. భారతదేశంలో ఈవీ విప్లవానికి ఇది నాయకత్వం వహిస్తుందని తెలిపారు.
అందరికీ ఉద్యోగాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించాలని కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయని చెప్పారు. పరిశ్రమలతో రాష్ట్రానికి సంపద వస్తుందని.. ఇది పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు ఉపయోగపడుతందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు వారి అవసరాలైన మానవశక్తి, భూమి, విద్యుత్, నీరు వంటి వాటి అవసరాలను అందించడం వల్లే తెలంగాణ వైపు చూస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దివిటిపల్లిలో బ్యాటరీ పరిశ్రమ వల్ల కాలుష్యం పెరుగుతుందన్న విమర్శలను మంత్రి తిప్పికొట్టారు.
పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడి పరిశ్రమలు తీసుకొస్తే.. కొంతమంది అభివృద్ధి నిరోధకులు, ప్రగతి నిరోధకులు జరిగే మంచికి విఘాతం కలిగించేప్రయత్నం చేస్తారని అన్నారు. బ్యాటరీ పరిశ్రమ అని కాలుష్యం వస్తుందని మాట్లాడుతున్నారని.. అయితే ఇది లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్ కంపెనీ.. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీలే తయారు చేస్తారని చెప్పారు. రాబోయే భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని చెప్పారు. జీరో లిక్విడ్ డిశ్చార్జితో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
