హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో చాలా విచిత్రమైన పరిస్థితులు కనబడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ పొత్తులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు గడ్డపోళ్లు ఒక్కటయ్యారని ఘాటుగా విమర్శించారు. తెలంగాణకు అడ్డంపడ్డ రెండు గడ్డపోళ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఒక్కటయ్యారని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీని బొంద పెడతానని స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపిస్తే ఇవాళ ఆ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి తోక పార్టీగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్, టీడీపీ హయాంలో కరెంటు లేక తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కరెంట్ షాక్‌లతో అర్ధరాత్రి చనిపోయే విధంగా, అరకొర కరెంట్ ఇచ్చి రాష్ట్రాన్ని దౌర్భాగ్య పరిస్థితిలోకి నెట్టిన పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలని గుర్తు చేశారు. రైతులకు కరెంట్ ఇవ్వని ఆరెండు పార్టీలు ఒకవైపు, 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న కేసీఆర్ మరొవైపని కేటీఆర్ అన్నారు.  
 
65 ఏళ్లలో ప్రజలకు కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని పార్టీలని, నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ మహమ్మారితో 2 లక్షల మంది బాధపడేవిధంగా చేసిన చంద్రబాబు నాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఒక్కటయ్యారని కేటీఆర్ విమర్శించారు. కేవలం నాలుగేళ్లలోనే ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. 65 ఏళ్లు రైతులను రాబందుల్లా పీక్కుతున్న కాంగ్రెస్ కావాలా.. రైతు బంధుతో ఆదుకుంటున్న టీఆర్ఎస్ కావాలో తేల్చుకునే సమయం వచ్చిందన్నారు. 

ఓ వైపు ఎన్నికలకు సిద్ధమంటూనే.. మరో వైపు తొందరేముందని ఈసీకి చెబుతారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. కేసీఆర్‌ను గద్దె దించేవరకు గడ్డం తీయనని ఉత్తమ్ అంటున్నారని, గడ్డం పెంచుకున్నోళ్లంతా గబ్బర్ సింగ్ అవుతారా అంటూ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.