హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను (Shaikpet flyover) శనివారం రోజున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో (Kishan Reddy) కలిసి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. 

హైదరాబాద్ నగరంలో మరో ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ను (Shaikpet flyover) శనివారం రోజున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో (Kishan Reddy) కలిసి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతుందని.. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నగరంలో పెద్ద ఎత్తున లింక్ రోడ్లు నిర్మించామని అన్నారు. ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూస్తున్నామని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు(RRR) కూడా త్వరలో పూర్తయ్యేలా చూస్తామని.. ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణం పూర్తయితే దేశంలోని ఏ నగరం కూడా హైదరాబాద్‌కు పోటీ రాదని అన్నారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్.. హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ అని అన్నారు. 

దేశ ఆర్థిక వ్యవస్థకు 4వ అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్​లో స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. రసూల్‌పురా దగ్గర కొంత స్థలం కేంద్రం ఆధీనంలో ఉంది.. కేంద్రం స్థలాన్ని కేటాయిస్తే ఫ్లైఓవర్ నిర్మాణం సులభతరం అవుతుందన్నారు. హైదరాబాద్‌లో గొల్కొండ, చార్మినార్.. వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు ఉన్నాయయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కంటోన్మెంట్‌లో మూసివేసిన 21 రోడ్లను తెరిపించేలా కృషి చేయాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరుతున్నట్టుగా చెప్పారు. 

ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోందన్నారు. రీజినల్ రిం్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు కోసం భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మోదీ ప్రభుత్వం వచ్చాక తెలంగాణకు జాతీయ రహదారులు వచ్చాయని అన్నారు. సైన్స్ సిటీ కోసం స్థలం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌కు లేఖ రాసినట్టుగా చెప్పారు. ఇందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని అనుకుంటున్నట్టుగా తెలిపారు. కుతుబ్ షాహీ టూంబ్స్ కోసం నిధులు విడుదల చేశామని చెప్పారు. 

Scroll to load tweet…

ఇక, రూ.333 కోట్ల వ్యయంతో 2.7 కిలో మీటర్ల మేర ఆరు లేన్లతో షేక్‌పేట్ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లై ఓవర్‌తో టోలిచౌకీ నుంచి రాయదుర్గాన్ని కలిపే ఈ ఫ్లైఓవర్ ద్వారా ట్రాఫిక్ కష్టాలు కొంతమేర తీరనున్నాయి. 2018లో ఈ ఫ్లై ఓవర్ పనులను ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన మూడున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ ఫ్లైఓవర్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌ సిటీ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.